శ్రీదేవి సినిమా చూసి అమితాబ్ కంటతడి
హైదరాబాద్: అతిలోక సుందరిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి త్వరలో 'ఇంగ్లీష్ వింగ్లిష్' చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ చిత్రం స్పెషల్ షో వీక్షించిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ వచ్చన్ కంట తడి పెట్టారు.
ఈ విషయమై బిగ్ బి తన బ్లాగులో వెల్లడిస్తూ...సినిమా చూసి చాలా ఎమోషన్ అయ్యాను. కొన్ని సీన్లు నా చేత కంటతడి పెట్టించాయి. ఎంత ఆపుకోవాలని ట్రై చేసినా నా వల్ల కాలేదు. అంత బాగుంది చిత్రం. ఈచిత్ర దర్శక నిర్మాతలకు అభినందనలు. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు ఎమోషన్ అవడం ఖాయం అన్నారు.
అమెరికాలో ఒక భారతీయ గృహిణి ఇంగ్లీష్ మాట్లాడేందుకు ఇబ్బందులు పడుతూ ఎదుర్కొన్న అవమానాలు, ఆ తర్వాత ఆమె ఏం చేసింది అనే ఇతి వృత్తంతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత హౌస్ వైఫ్ గా సెటిలైన శ్రీదేవి ఇంతకాలం తన ఇద్దరు కూతుర్ల బాగోగులు చూసుకుంటూ గడిపేసింది. అలా అని అందాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పటికీ సన్నటి తీగలా నవనవలాడుతోంది. మరి శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ ఏమేరకు సక్సెస్ అవుతుందో..
ఈ చిత్రంలో అమితాబ్, అజిత్ అతిథి పాత్రల్లో కనిపిస్తున్నారు. ఎక్కువ భాగం న్యూయార్క్ లో షూటింగ్ జరుపుకుంటున్న 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రంలో శ్రీదేవి, ఆదిల్ హుస్సేన్, ప్రియా ఆనంద్, మెహిదీ నెబ్బో నటిస్తున్నారు. సంగీతం: అమిత్ త్రివేది, సౌండ్: రసూల్ పూకుట్టి, ఫోటో గ్రఫీ: లక్ష్మణ్ ఉటేకర్, ఎడిటింగ్: హేమంతి సర్కార్, నిర్మాతలు: రాకేష్ జుంజుంవాలా, ఆర్.దమని, సునీల్ లుల్లా, ఆర్. బాల్కీ, రచన-దర్శకత్వం: గౌరీ షిండే.


Click it and Unblock the Notifications











