సూపర్‌స్టార్ పాదాల చెంత ‘బిగ్ బి’ కంటతడి
బాలీవుడ్ ఫస్ట్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా మృతి బాలీవుడ్ ప్రముఖులందరినీ కలిచి వేసింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ విషయం తెలియగానే హుటా హుటిన అందరికంటే ముందు రాజేష్ ఖన్నా నివాసానికి చేరుకుని సంతాపం ప్రకటించారు. రాజేష్ ఖన్నాతో కలిసి అమితాబ్ నటించిన 'ఆనంద్' సినిమాలోని ఓ దృశ్యంలోలా కాకా మృతదేహాన్ని చూడటానే అమితాబ్ బాగా ఎమోషన్‌కు గురయ్యారు. ఆయన పాదాలు పట్టుకుని కంటతడి పెట్టారు. అమితాబ్‌లో చాలా బాధ కనిపించిందని ప్రత్యక్షంగా చూసిన వారంతా అంటున్నారు.
అదే విధంగా రాజేష్ ఖన్నా మృత దేహాన్ని బాలీవుడ్ టాప్ స్టార్లు అంతా సందర్శించారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అభిషేక్ తదితరులు సందర్శించి ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. రాజేష్ ఖన్నా అంతిమయాత్ర ఈ రోజు ఉదయం ముంబైలో ప్రారంభం అయింది. తమ అభిమాన నటుడిని చివరి చూపు చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.
మరో వైపు పాకిస్థాన్ ప్రధాని రాజా ఫర్వేజ్ అష్రాఫ్ కూడా రాజేష్ ఖన్నాకు సంతాపం ప్రకటించారు. కళా, చిత్ర రంగాలకు ఆయన చేసిన సేవలను ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని ఆయన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. రాజేష్ ఖన్నాకు పాకిస్థాన్ లో అనేక మంది అభిమానులు ఉన్నారని చెప్పుకొచ్చారు. రాష్ట ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సైతం రాజేష్ ఖన్నా మృతికి సంతాపం ప్రకటించారు.


Click it and Unblock the Notifications












