నేను అప్పుడు తప్పు చేశాను: అమితాబ్
ముంబై: దాదాపు ఎనిమిదేళ్లనాడు చేసిన చిత్రంలో దొర్లిన తప్పును గుర్తు చేసుకొంటుంటే తానో సాధారణ నటుణ్ని అనిపిస్తోందన్నారు అమితాబ్ బచ్చన్. బాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగిన అమితాబ్ ఎప్పటికప్పుడు తనలోని నటుడ్ని సమీక్షించుకుంటూ ముందుకుసాగుతూంటారు. తప్పు ఒప్పొప్పులన్ని బేరేజు చేసుకుంటూ మరింత పరిణితితో కూడిన నటనను అందించటానికి ఆయన ప్రయత్నిస్తూంటారు. ఈ నేపధ్యంలో ఆయన బ్లాక్ సినిమాలో జరిగిన చిన్న తప్పును గుర్తు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచారు.
2005లో వచ్చిన 'బ్లాక్' సినిమాలో దేవరాజ్ సహాయ్ అనే పాత్రలో జీవించారు అమితాబ్. ఈ సినిమాలో ఆయన అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుడిగా కనిపిస్తారు. ఆ చిత్రంలో నటనకుగాను అమితాబ్ జాతీయస్థాయిలో ఉత్తమ నటుడి పురస్కారం అందుకొన్నారు. అయితే ఆ సినిమాలో తానో తప్పు చేశాననీ, అదేమిటో చెప్పగలరా అంటూ తన బ్లాగ్‌లో అభిమానుల్ని ప్రశ్నించారు బిగ్ బి. ఆ తరవాత తానే ఆ తప్పుని వెల్లడించారు.
అమితాబ్ మాట్లాడుతూ...''చిత్రంలో చెవిటి, మూగ అమ్మాయి పాత్ర పోషించిన రాణీముఖర్జీకి ఉపాధ్యాయుడిగా నటించాను. ఆ తరవావాత అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుడినవుతాను. ఒక సన్నివేశంలో రాణీముఖర్జీ - బల్లపై ఒక ఉత్తరం ఉంచుతుంది. అది చదవడం కోసం నా చేత్తో నేరుగా జేబులో ఉన్న కళ్ల జోడు తీసి చదువుతాను. నిజానికి నేను అలా చేయకూడదు. ఎందుకంటే ఆ పాత్ర స్వభావం ప్రకారం, వ్యాధి తాలూకు లక్షణాల్ని కళ్లజోడు వెదుక్కొనే క్రమంలోనూ చూపించాలి. అలా చేయలేదు. ఎనిమిదేళ్లయినా ఆ సన్నివేశం చూసినా, గుర్తుకొచ్చినా నేనూ సాధారణ నటుణ్నే కదా అనిపిస్తోంది. ఆ ఒక్క సన్నివేశం ఎంతో అసంతృప్తి కలిగించింది''అన్నారు.


Click it and Unblock the Notifications











