అమితాబ్, అభిషేక్ బచ్చన్‌కు కరోనావైరస్.. నానావతి హాస్పిటల్‌లో చేరిక
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనావైరస్ బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన రోగ నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఇద్దరిని హుటాహుటిన ముంబైలోని ప్రముఖ హస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన స్వయంగా తాను కోవిడ్ బారిన పడినట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కోవిడ్ బారిన పడిన బిగ్ బీ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. అమితాబ్ తన ఆరోగ్యం గురించి తెలిపిన వివరాలు ఏమిటంటే..

మహారాష్ట్ర, ముంబైలో రికార్డుస్థాయిలో కరోనా
మహారాష్ట్రలో కరోనావైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నది. ప్రధానంగా ముంబైలో పెద్ద ఎత్తున కరోనావైరస్ పాజిటివ్ కేసులో నమోదు అవుతున్నాయి. శనివారం మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 8139 కేసులు నమోదయ్యాయి. ఓవరాల్‌గా రాష్ట్రంలో ఇప్పటి వరకు 246600 కేసులు నమోదయ్యాయి. ముంబై నగరం విషయానికి వస్తే.. శనివారం జూలై 11న 1308 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ముంబైలో 91547 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి.

నానావతి హాస్పిటల్‌కు బిగ్ బీ, అభిషేక్
ఇలాంటి పరిస్థితుల్లో అమితాబ్, అభిషేక్ బచ్చన్‌కు కరోనావైరస్ తేలగానే కుటుంబ సభ్యులు వెంటనే ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో తరలించారు. ప్రస్తుతం వారిద్దరికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. వారి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు అందాల్సి ఉన్నవి. మీడియాలో గందరగోళం నివారించడానికి అమితాబ్ స్వయంగా ట్వీట్ చేసి తన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించారు.

ట్విట్టర్‌లో అమితాబ్ ట్వీట్
అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నా ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్‌కు తరలించారు. నా కుటుంబ సభ్యులు, స్టాఫ్ కూడా కోవిడ్ టెస్ట్ జరిపించుకోవాలని హస్పిటల్ వర్గాలు సూచించాయి. గత 10 రోజుల్లో నాతో సన్నిహితంగా ఉన్న వారందరూ దయచేసి వారంతట వారే పరీక్షలు నిర్వహించుకోవాలని మనవి చేస్తున్నాను అని అమితాబ్ సూచించారు.

గులాబో సితాబో సినిమాతో ప్రేక్షకుల ముందుకు
షుజిత్ సర్కార్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం గులాబో సితాబో చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటించారు. తొలుత ఈ సినిమాను సినిమా హాళ్లలో రిలీజ్ చేయాలనుకొన్నారు. కానీ కరోనావైరస్ లాక్ డౌన్ కారణంగా ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయలేకపోయారు. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నది.

కేబీసీ షో కోసం ప్రిపేర్
అమితాబ్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి రియాలిటీ షో కోసం సిద్ధం అవుతున్నారు. ఈ ప్రొగ్రాం కోసం ఆయన ఇటీవల టెలివిజన్ ఛానెల్‌లో ప్రమోషన్ ప్రకటనల్లో పాల్గొంటున్నారు. ఈ షో కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో బిగ్ బీ కరోనావైరస్ బారిన పడటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రస్తుతం చెహ్రే, బ్రహ్మాస్త్ర, జుండ్ చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











