Project K కోసం మహీంద్రాను సాయం అడిగిన నాగ్ అశ్విన్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన ఆనంద్.. మాములుగా ఉండదు మరి!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఆయన చేస్తున్న రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. మిగతా అన్ని సినిమాల సంగతి పక్కన పెడితే నాగ్ అశ్విన్ సినిమా మీద మరిన్ని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ ఆనంద్ మహీంద్రాను సాయం అడగడం దానికి ఆయన చేస్తానని సిద్ధం కావడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు మీకోసం..

వందల కోట్ల భారీ బడ్జెట్తో
ప్రభాస్ ప్రాజెక్టు K సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే చేసింది రెండు సినిమాలే అయినా రెండూ సూపర్ హిట్స్ అందుకున్న దర్శకుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ నిర్మాణ సారధ్యంలో దాదాపు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను ప్లాన్ చేశారు.

ఆనంద్ మహీంద్రాను టాగ్ చేస్తూ
దానికి తోడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ భామ దీపికా కూడా ఈ సినిమాలో భాగం కావడంతో ఇది పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ సినిమా అంటూ ముందే నాగ్ అశ్విన్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాను టైమ్ ట్రావెల్ జానర్లో, పూర్తి సై-ఫై థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న క్రమంలో దర్శకుడు అయితే ప్రతి విషయంలో కూడా హై టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా విషయంలో తనకు సాయం కావాలంటూ దర్శకుడు నాగ్ అశ్విన్.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను టాగ్ చేస్తూ ట్విట్టర్ వేదికగా కోరారు.

మీ సహకారం కావాలి
సాంకేతికంగా తమ సినిమాకి సాయం చేయమని ట్విట్టర్ వేదికగా రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు నాగ్ అశ్విన్ తన ట్వీట్ లో.. 'డియర్ ఆనంద్ మహీంద్రా సార్.. మీరు ఎన్నో విషయాల్లో నన్ను ఇన్స్పైర్ చేశారు. ప్రస్తుతం నేను అత్యంత భారీ బడ్జెట్‌తో అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికలతో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా 'ప్రాజెక్టు K' రూపొందిస్తున్నా. ఈ సినిమా కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం. దీనికోసం స్పెషల్ గా వెహికల్స్ ను తయారు చేయిస్తున్నాము. అవి నేటి సాంకేతికతకు మించి ఉంటాయి' అని పేర్కొన్నారు.
మీ సహకారం కావాలి
ఈ సినిమాను అనుకున్నట్లుగా తీయగలిగితే.. అది మన దేశానికే గర్వకారణమవుతుంది. మా టీమ్ లో టాలెంటెడ్ వ్యక్తులు ఇంజినీర్లు అత్యుత్తమ డిజైనర్‌లు ఉన్నారు. అయితే, ఈ సినిమా అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది కాబట్టి దానికి మీ సహకారం కావాలి' అంటూ కోరారు. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

నో ఎలా చెప్పగలం
'ఫ్యూచర్ మొబిలిటీను ఊహించడంలో మీకు సాయం చేయడానికి మేం నో ఎలా చెప్పగలం..? మా గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ చీఫ్ వేలు మహీంద్రా మీకు సహాయం చేస్తారు. ఆయన xuv700ని డెవలప్ చేశారంటూ' ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి నాగ్ అశ్విన్ థాంక్స్ చెబుతూ.. ఎలక్ట్రిక్ మొబిలిటీ నిపుణుల సాయం కూడా కావాలని ట్వీట్ చేశారు. మొత్తం మీద ఈ సినిమా మీద ఈ ట్వీట్ల వ్యవహారం కూడా మరింత ఆసక్తి పెంచిందని చెప్పాలి.


Click it and Unblock the Notifications











