ఎన్టీఆర్ ఆ మాట అనే సరికి కంగారు పడ్డాను.. నా జీవితంలో మర్చిపోలేను: యాంకర్ రవి ఎమోషనల్ పోస్ట్
తనదైన శైలి హోస్టింగ్‌తో తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్లుగా వెలుగొందుతున్నాడు యాంకర్ రవి. లేడీ యాంకర్ల నుంచి విపరీతమైన పోటీ ఉన్న సమయంలోనే తన మార్క్ చూపించి సత్తా చాటాడతను. అంతేకాదు, వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పటికీ.. తరచూ ఏదో ఒక వివాదంలో భాగం అవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. అయినప్పటికీ వరుసగా షోలు, ఈవెంట్లను హోస్ట్ చేస్తూ దూకుడును ప్రదర్శిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రవి.. జూనియర్ ఎన్టీఆర్‌పై ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. వివరాల్లోకి వెళ్తే...

అలా వచ్చాడు.. తట్టుకుని నిలబడ్డాడు
అద్భుతమైన హోస్టింగ్‌తో పాటు అదిరిపోయే టైమింగ్‌తో ఆకట్టుకుంటోన్న యాంకర్ రవి.. దాదాపు పదేళ్ల క్రితమే బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి వరుసగా టీవీ షోలు, సినీ ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు ఇలా ఎన్నో ఆఫర్లతో బిజీ బిజీగా గడిపాడు. ఈ క్రమంలోనే లేడీ యాంకర్ల పోటీని తట్టుకుని నిలబడ్డాడు.

ఒక్క షోతో హాట్ టాపిక్... మారిన కెరీర్
రవి కెరీర్‌లో ఎన్నో షోలు చేశాడు.. అందులో ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన స్టాండప్ కామెడీ షో 'పటాస్' ప్రత్యేకమైనది. ఇది ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో వల్ల రవికి మంచి పేరు రావడంతో పాటు బ్యాడ్ నేమ్ కూడా వచ్చింది. మరీ ముఖ్యంగా యాంకర్ శ్రీముఖితో కలిసి చేసిన కొన్ని ఎపిసోడ్స్ హాట్ టాపిక్ అయ్యాయి. తర్వాత దీని నుంచి తప్పుకున్నాడు.

ఆ గొడవతో చెడ్డ పేరు.. వివరణ ఇచ్చినా
సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు యాంకర్ రవి. అదే సమయంలో చాలా సార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. వీటిలో ఓ సినిమా ఫంక్షన్‌లో ఆడవాళ్లపై చేసిన కామెంట్స్ పెద్ద రాద్దాంతం అయ్యాయి. ఆ తర్వాత అతడు మహిళలకు పలుమార్లు క్షమాపణలు కూడా చెప్పాడు. అయినప్పటికీ యాంకర్ రవిపై మహిళా సంఘాలు గొడవలు చేయడం మాత్రం ఆగలేదు.

ఒకే ఒక్క సినిమా... స్టేషన్ మెట్టెక్కాడు
యాంకర్ రవి 'ఇది మా ప్రేమకథ' అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోగానూ పరిచయం అయ్యాడు. ఈ మూవీ డిజాస్టర్ అయింది. ఈ సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ సందీప్ తనను రూ. 41 లక్షలు ఇవ్వకుండా మోసం చేశాడని ఫిర్యాదు చేశాడని రవి అతడిపై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు పెట్టాడు. ఆ తర్వాత అతడు కూడా యాంకర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

స్పెషల్ ఈవెంట్‌కు హోస్టుగా వెళ్లిన రవి
మూడు రోజుల క్రితం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్-2021 వార్షిక సదస్సు జరిగింది. ఎంతో సందడిగా సాగిన ఈ ఈవెంట్‌కు యాంకర్ రవి హోస్ట్‌గా చేశాడు. దీనికి పోలీస్ అధికారులతో పాటు టాలీవుడ్ టాప్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అతడు రావడం రావడమే అందరినీ పలకరించాడు. అదే సమయంలో యాంకర్ రవితోనూ కాసేపు ముచ్చటించాడు.

ఎన్టీఆర్ ఆ మాట అనే సరికి కంగారు పడ్డా
తాజాగా ఎన్టీఆర్ గురించి యాంకర్ రవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 'నా అభిమాన హీరో ఎన్టీఆర్ అతిథిగా విచ్చేసిన కార్యక్రమాన్ని హోస్ట్ చేయడం నాకు దక్కిన గౌరవం. ఆయన స్పీచ్ ఆలోచింపజేసే విధంగా, భావోద్వేగంగా ఉంది. ఆయన నా వైపు చూసి 'బాగున్నారా' అని అడిగారు. దీంతో కంగారు పడ్డాను. ఈరోజును నాకు తీపిగుర్తుగా చేశారు. ఎ ట్రూ స్టార్' అని రాసుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











