అందాలరాముడు 11న వస్తున్నాడు
కమేడియన్ సునీల్ హీరోగా, అందాల తార ఆర్తీ అగర్వాల్ హీరోయిన్‌గా ముస్తాబయిన అందాలరాముడు చిత్రం ఈనెల 11న ఆంధ్రా అంతటా విడుదలవుతోంది. తమిళంలో సుందరపురుషన్ ఘనవిజయం సాధించడంతో మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసింది. సూపర్‌గుడ్ అధినేత ఆర్.బి. చౌదరి సమర్పణలో నిర్మాతలు పరాస్ జైన్, ఎన్ వి ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఏ ముహూర్తాన్న ఈ సినిమా మొదలుపెట్టారో గానీ ఈ కామెడీ సినిమా నిర్మాణం నిర్మాతలను చాలాసార్లు కన్నీళ్లు పెట్టించింది.
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలైంది. ఆ తరువాత అమెరికా వెళ్లిపోయింది. అప్పటికి రెండు పాటలు, కొన్ని సన్నివేశాల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండిపోయాయి. కొన్ని నెలల పాటు ఈ ప్రాజెక్టు ఆగిపోయినా చివరికి నిర్మాతలు నానా పాట్లు పడి సినిమాని పూర్తి చేశారు.
మరోవంక ఈ చిత్ర హీరో సునీల్ ఈ సినిమా ద్వారా తాను హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం ఏదీ చేయననని స్పష్టం చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో హీరో తాను కాదని, ఆర్తీ అగర్వాల్ అని ఆయన ముందు నుంచే చెబుతున్నారు. పాత్రోచితంగా ఒక కమెడియన్ ప్రధాన భూమిక పోషించాలి కాబట్టి తాను అంగీకరించానని సునీల్ చెబుతున్నారు. నిజానికి కమేడియన్లు హీరోలుగా నటించినా పెద్దగా నష్టం లేదని గత కమేడియన్ల అనుభవాలను బట్టి తెలుస్తుంది. అలనాటి నటుడు కస్తూరి శివరావు (గుణసుందరికథ) నుంచి రేలంగి, రాజబాబు, బ్రహ్మానందం, బాబూమోహన్, అలీ వరకూ అంతా హీరోలుగా సూపర్‌హిట్ సినిమాలు అందించి కూడా కమేడియన్లుగా చెలామణీ అవుతున్న వారే. ఇప్పుడు వారి కోవలోకి సునీల్ కూడా చేరడం విశేషమే!


Click it and Unblock the Notifications