AP Election Results Live: నగరిలో రోజా వెనుకంజ.. మార్గాని భరత్ దారుణ ఓటమి!
దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఆయా పార్టీల ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో తెరిచారు. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ తెలుగుదేశం కూటమి ముందంజలో దూసుకుపోతోంది. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్, హిందూపురంలో నందమూరి బాలకృష్ణలు ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీ 55, జనసేన 9, వైసీపీ 9, బీజేపీ 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.
అయితే రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన నగరిలో మంత్రి రోజా వెనుకంజలో ఉన్నారు. ఆమెపై టీడీపీ అభ్యర్ధి గాలి భాను ప్రకాష్ ఆధిక్యంలో ఉండటం గమనార్హం. 2014, 2019లలో వైసీపీ నుంచి వరుస విజయాలు అందుకున్న రోజా 2024లోనూ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని కృతనిశ్చయంతో వున్నారు. అయితే సొంతపార్టీలోనే ఆమెకు అసమ్మతి సెగ వెంటాడుతోంది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మొదలైన విభేదాలు నేటికి తారాస్థాయికి చేరుకున్నాయి.

ఒకానొక దశలో రోజాకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని నియోజకవర్గ నేతలు తేల్చిచెప్పారు. అయితే పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఆమెకు మార్గం సుగమమైంది. కానీ నామినేషన్ దాఖలు చేసే సమయంలో రోజా వెంట కీలక నేతలెవ్వరూ లేకపోవడం చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో కీలకమైన వడమాలపేట, నిండ్ర మండలాల్లో రోజా అసమ్మతిని ఎదుర్కొంటున్నారు.
2014, 2019 ఎన్నికల సమయంలోనూ రోజా గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధించారు. 2014లో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడుతో తలపడ్డ ఆమె కేవలం 871 ఓట్ల తేడాతో విజయం సాదించారు. 2019 ఎన్నికల్లో ఆయన తనయుడు భానుప్రకాష్‌పై 2007 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో రోజాకు కీలకమైన ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి దక్కింది. అనంతరం కేబినెట్ పునర్వ్యస్ధీకరణలో భాగంగా క్రీడా, పర్యాటక శాఖ మంత్రిగా జగన్ ఆమెకు అవకాశం కల్పించారు.

వైసీపీకీ చెందిన మరో కీలకనేత మార్గాని భరత్ కూడా వెనుకంజలో ఉన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో నిలిచిన ఆయనపై టీడీపీ అభ్యర్ధి ఆదిరెడ్డి వాసు ఆధిక్యంలో ఉన్నారు. కౌంటింగ్ సరళి నేపథ్యంలో మార్గాని భరత్ లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
2019 లోక్‌సభ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి వైసీపీ అభ్యర్ధిగా విజయం సాధించిన భరత్ .. పార్టీకి గొంతుకగా నిలిచారు. సీఎం జగన్‌పైనా, వైసీపీపైనా ఈగ వాలనిచ్చేవారు కాదు. ప్రత్యర్ధుల విమర్శలకు ఘాటుగా బదులిచ్చేవారు. 2024 ఎన్నికల్లోనూ మరోసారి లోక్‌సభ బరిలో భరత్ నిలుస్తారని వార్తలు వచ్చినా జగన్ వ్యూహం మార్చారు. రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి బదులుగా .. రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానం టికెట్ భరత్‌కు కేటాయించారు. జగన్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని ఆయన తొలి నుంచి ధీమాగా ఉన్నారు. నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్ధించారు.


Click it and Unblock the Notifications










