భీమ్లా నాయక్ రిలీజ్.. మళ్ళీ రంగంలోకి ఏపీ సర్కార్.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రానా కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమాను ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పవన్ కళ్యాణ్ సినిమాకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

టికెట్ల ధరల తగ్గింపు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సినిమా విడుదల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఇష్టం వచ్చిన రేట్లకు సినిమా టికెట్లు అమ్ముతున్నారు అని చెబుతూ మొత్తం నాలుగు ప్రాంతాలుగా విభజించి గ్రామ పంచాయతీకి ఒక రేటు. నగర పంచాయతీకి ఒక రేటు. మున్సిపాలిటీ కి ఒక రేటు. మున్సిపల్ కార్పొరేషన్ కి ఒక రేటు చొప్పున సినిమా టికెట్ల ధరలను నిర్ణయించింది.

సీజ్ కూడా
అంతేకాక ఎంత పెద్ద సినిమా అయినా బెనిఫిట్ వేసే అవకాశం ఇవ్వడం లేదు అంటూ పేర్కొంది. ఒకవేళ బెనిఫిట్ షో కనుక వేసినట్లు తెలిస్తే సినిమా థియేటర్లను సీజ్ చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడని పరిస్థితి కనిపించింది. అఖండ సినిమా విడుదల సందర్భంలో కొన్ని థియేటర్లలో బెనిఫిట్ షో వేశారు అన్న సంగతి తెలుసుకుని ఆయా థియేటర్లకు వెళ్ళిన లోకల్ రెవెన్యూ సిబ్బంది సీజ్ కూడా చేశారు.
అయితే ఇప్పుడు సినిమా పరిశ్రమ నుంచి కొంతమంది పెద్దలు వెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్ తో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకున్నామని, ఇక అంతా శుభమే అని ప్రకటించారు. దీంతో భీమ్లా నాయక్ సినిమా కంటే ముందే ఒక జీవో వస్తుందని అందరూ భావించారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో విడుదల కాలేదు.

అధికారుల నిఘా
పైపెచ్చు ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాకి బెన్ ఫిట్ షో ఉండదని, అతిక్రమించి బెన్ ఫిట్ షో వేస్తే కఠిన చర్యలు తప్పవని థియేటర్లకు రెవెన్యూ శాఖ నుంచి నోటీసులు అందాయి. టికెట్ రేట్లు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలి. ప్రతి థియేటర్ వద్ద రెవెన్యూ అధికారులు నిఘా ఉంటుందని, ధియేటర్ యాజమాన్యం సహకరించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

భారీ రేంజ్‌లో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో రాబోతున్న భీమ్లా నాయక్' ను 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో రూపొందించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. తమన్ బాణీలు కట్టారు. నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 25న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించనున్న విషయం తెలిసిందే.

ప్రీ రిలీజ్ ఈవెంట్
6 గంటల నుంచి హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. నిజానికి ఈ వేడుక సోమవారం జరగాల్సి ఉండగా.. ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో వాయిదా పడింది. అంతే కాక ఈవెంట్‌కు 21వ తేది కోసం ఇచ్చిన పాసులకు అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు. 23వ తేదీ పాసులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











