Pawan Kalyan Arrest: పవన్ కల్యాణ్ అరెస్ట్.. రోడ్డుపై పడుకుని మరీ.. అదే జరిగితే సినిమాలు కష్టమే
ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. శనివారం తెల్లవారుజామున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఆదివారం షూట్‌కు గ్యాప్ ఇచ్చి జనసేన పార్టీ పీఏసీ మీటింగ్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం మంగళగిరిలో ఉన్న కేంద్ర కార్యాలయానికి హైదారాబాద్ నుంచి బయలుదేరాడు. దీంతో ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో అతడిని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు.

చంద్రబాబు నాయుడు అరెస్ట్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ రాకను పోలీసులు అడ్డుకున్నట్లు చెప్పారు. మొదట గరికపాడు వద్ద పవన్ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో కిందకు దిగిన జనసేనాని రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపాడు. దీనికితోడు పోలీసులు పెట్టిన బారీకేడ్లను జనసేన పార్టీ కార్యకర్తలు తొలగించారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. తర్వాత పవన్ వెళ్లేందుకు పర్మీషన్ ఇచ్చారు.
పవన్ కల్యాణ్ వాహనాన్ని పోలీసులు అనుమంచిపల్లి నిలిపేశారు. దీంతో జనసేనాని రోడ్డుపై పడుకుని నిరసన తెలిపాడు. అక్కడ పరిస్థితి చేయి దాటిపోయిందని భావించిన పోలీసులు పవన్ కల్యాణ్‌తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తమ వాహనంలో తరలించారు. దీంతో జనసైనికులు పలు ప్రాంతాల్లో వాళ్లను అడ్డుకున్నారు.

అదుపులోకి తీసుకున్న కొద్ది సేపటి తర్వాత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు విడిచి పెట్టారు. ఇలా ఎన్నో రకాల హైడ్రామాల తర్వాత జనసేన అధినేతను మంగళగిరి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అంతేకాదు, కేవలం మూడు కార్లలోనే ఆయన వెళ్లాలని సూచించారు. దీంతో కొన్ని గంటల క్రితమే పవన్ కల్యాణ్ మంగళగిరి చేరుకున్నాడు. ఇదిలా ఉండగా.. పవన్ ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదంతా పక్కన పెడితే.. పవన్ కల్యాణ్ అరెస్ట్, విడుదల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఈ ప్రభావంతో జనసేన అధినేత మళ్లీ నిరసన కార్యక్రమాలు, ప్రభుత్వ తీరుపై పోరాటలు వంటివి చేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఇప్పుడు తన సినిమాలకు ఇచ్చిన డేట్స్‌ను క్యాన్సిల్ చేసుకునే చాన్స్ ఉంది. దీనివల్ల ఆయా చిత్రాలు మరింత ఆలస్యం అవ్వొచ్చని సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











