ఆ హోటల్‌లోనే అంజలి మాయం, ఫిర్యాదు చేసిన సోదరుడు
హైదరాబాద్: తన పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం వల్ల ఎదుర్కొంటున్న వేధింపులను మీడియా ముందు వెల్లబోసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' హీరోయిన్ అంజలి నిన్న రాత్రి నుంచి కనపడకుండా పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సోదరుడు రవి శంకర్ మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.
నిన్న రాత్రి హైదరాబాద్‌లోని 'దస్పల్లా' హోటల్ నుంచి తన సోదరి మాయమైందని, ఆమె దస్పల్లా హోటల్‍లో ఉన్నట్లు పిన్ని భారతీదేవి వెల్లడించిందని, దన సోదరి అదృశ్యం వెనక భారతీ దేవి హస్తం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసారు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి తన సోదరి అంజలి పిన్ని భారతీదేవి వద్ద ఉంటోందని, హీరోయిన్ అయిన తర్వాత తన సోదరిని వారు డబ్బు కోసం వేధింపులకు గురి చేసే వారని రవి శంకర్ ఆరోపించారు.
అదృశ్యం కావడానికి ముందు అంజలి మీడియాతో మాట్లాడుతూ..'' నా వెంటే ఉంటూ నాకు గోతులు తవ్వారని, ఇప్పుడు నా వద్ద చిల్లిగవ్వ లేకుండా నా ఆస్తి అంతా మింగేశారని, ఇప్పుడు చిత్ర హింసలు పెడుతున్నారని" అంజలి తన పిన్ని భారతీ దేవిపై మండి పడింది. తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపించింది.
నా సొంత అక్క, అన్నలతో కూడా మాట్లాడనీయకుండా చిత్రహింసలు పెడుతున్నారని, నా ప్రాణాలకు వీరి నుండి ముప్పు ఉందని, ఏం జరిగినా వీరిదే భాధ్యత అని తేల్చిచెప్పింది. వీరితో పాటు దర్శకడు కలంజియం కూడా నన్ను మోసం చేశారని, నేను మేజర్ ను అయ్యాను కాబట్టి వీరికి దూరంగా ఉండాలని హైదరాబాద్ లో ఉంటున్నానని మీడియాకు తెలిపింది.


Click it and Unblock the Notifications












