మిస్టరీ వీడింది : నిర్మాత రక్షణలో అంజలి
అంజలి అదృశ్యం కాలేదని, ఇష్టపూర్వకంగానే హోటల్ నుంచి వెళ్లిపోయారని హైదరాబాద్ పశ్చిమమండలం డీసీపీ జి.సుధీర్‌బాబు తెలిపారు. ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఆమె తాను క్షేమంగా ఫలానా చోట ఉన్నానంటూ తమకు సమాచారం ఇచ్చాక చట్టప్రకారం చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసు ఉపసంహరణ సాధ్యం కాదని చెప్పారు. ఆమె ఎక్కడున్నారన్నదానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
అంజలి అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఆమె ఫోన్ల జాబితాను సేకరించి వాటిని విశ్లేషించారు. సినీ నటీనటులు, నిర్మాతలు, కొన్ని కంపెనీలు, ట్రావెల్ ఏజెంట్ల నంబర్లన్నీ అందులో ఉన్నాయి. సోమవారం ఉదయం ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేంతవరకూ ఆమె చేసిన ఫోన్ కాల్స్, ఆమెకు వచ్చిన ఫోన్ కాల్స్‌ను పరిశీలించారు. సన్నిహితంగా ఉండే ఇద్దరు యువ హీరోయిన్లను పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం. బుధవారం రాత్రి ఒక డబ్బింగ్ సినిమాల నిర్మాత, అతడి సోదరుడిని విచారించారు.
అంజలి నీకు ఏ సమస్య ఉన్నా నిన్ను ఆదుకోవడానికి తెలుగు పరిశ్రమ సిద్ధంగా ఉందని, నీవు ఇలా చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడంవల్ల పెద్ద చిత్రాల షూటింగ్‌లకు అంతరాయం కలుగుతోందని, ఇది హర్షణీయం కాదని, దయచేసి ఎక్కడ ఉన్నా నీ క్షేమ సమాచారాలతో సంప్రదించవలసిందిగా కోరుతున్నామని క్రేజీ చిత్ర నిర్మాత సురేష్ కొండేటి విజ్ఞప్తి చేశారు.


Click it and Unblock the Notifications












