అంజలి కోసం 70 లక్షలు ఖర్చు పెట్టానంటున్న పిన్ని
హైదరాబాద్: పెంచి పెద్ద చేయడంతో పాటు, అంజలిని హీరోయిన్‌గా చేయడానికి ఇప్పటి వరకు రూ. 70 లక్షలు అప్పులు చేసి ఖర్చు పెట్టానని, అంజలి ఇప్పుడు తనను విడిచి వెళ్లింది కాబట్టి నెలకు రూ. 50 వేలు జీవన భృతి చెల్లించాలని కోరుతూ భారతీదేవి గత నెలలో ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ దాఖ చేసారు. పిటీషన్‌ను బుధవారం కోర్టు విచారణకు స్వీకరించి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది.
హీరోయిన్ అంజలి ఆ మధ్య కొన్ని రోజుల పాటు అదృశ్యం అవడంతో ఆమె పిన్ని భారతీదేవి... అంజలి కనిపించడం లేదంటూ మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా భారతీ దేవి ఆ పీటీషన్ ను ఉపసంహరించుకుంది.
పిన్నితో విబేధాల కారణంగానే అంజలి ఆమెకు దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో కోర్టుకు కూడా హాజరు కావడం లేదు. షూటింగుల కారణంగానే రాలేక పోతోందని ఆమె తరుపు లాయర్ కోర్టుకు విన్నవించారు. దీంతో హెబియస్ కార్పస్ పిటీషన్ మంగళవారం ఉపసంహరించుకుంది భారతీ దేవి.
మరో వైపు అంజలిపై దర్శకుడు కళంజియం వేసిన పరువు నష్టం పిటీషన్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కూడా అంజలి పలు మార్లు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె ఒక్కసారి కూడా కోర్టు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెకు కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications












