మల్లన్న సేవలో హీరోయిన్ అంజలి, ప్రత్యేక పూజలు
కర్నూలు: ప్రముఖ సినీ కథానాయిక అంజలి గురువారం శ్రీశైలం వచ్చారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. శ్రీశైల మల్లికార్జునుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన కంకణాన్ని ధరించి ఈ పూజల్లో అంజలి పాల్గొన్నారు.
విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబులు ప్రధానపాత్రలుగా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ద్వారా తెలుగులో అంజలి భారీ హిట్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు జర్నీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. అయితే ఇటీవల ఆమెకు తన పిన్ని, బాబాయిలతో విభేదాలు రావడం, కోర్టుకు ఎక్కడం వరకు వెళ్లడంతో చర్చనీయాంశమైంది.

గత నెలలో అంజలి తన పిన్ని భారతీదేవి, బాబాయి సూరిబాబుపై కేసు కూడా పెట్టారు. వారిద్దరూ తనను బెదిరిస్తున్నారని... రక్షణ కల్పించాలంటూ మద్రాసు కోర్టును ఆశ్రయించింది. వారి దగ్గరున్న తన ఆస్తులను తనకు ఇప్పించాలంటూ కోరింది. ఈ మేరకు అంజలి ఫిర్యాదును పరిశీలించిన కోర్టు వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
అంజలిపై కూడా పలు కేసులు నడుస్తున్నాయి. తమిళ దర్శకుడు కళంజియ్ వేసిన పరువు నష్టం దావా కేసులో చెన్పైలోని సైదాపేట కోర్టు హీరోయిన్ అంజలికి కొన్ని రోజుల క్రితం సమన్లు జారీ చేసింది.
పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని, తన ఆస్తులు వాడుకుంటున్నారని, మానసికంగా హింసిస్తున్నారని మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేసిన అంజలి ఆ తర్వాత అజ్ఞాతంలో వెళ్లి అందరినీ హైరానా పెట్టింది. ఆ తర్వాత అజ్ఞాతం వీడిన ఆమె తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.


Click it and Unblock the Notifications











