రైతు పరిస్థితి మారలేదు: ‘అన్నదాత సుఖీభవ’ ఆడియో వేడుకలో నారాయణ మూర్తి
విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి కార్మికులు, కర్షకుల సమస్యలను ఫోకస్ చేస్తూ ఎన్నో మంచి చిత్రాలు తీశారు. తాజాగా ఆయన రైతుల సమస్యపై 'అన్నదాత సుఖీభవ' సినిమా చేస్తున్నారు. మే 18న సినిమా విడుదలవుతుంది. తాజాగా ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లో జరిగింది. మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ ఆడియో సీడీలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ.. 500 సంవత్సరాల క్రితం శిస్తు కట్టలేదని కవి శ్రీనాథుడితో రాళ్లు మోయించారు. కొరడాలతో కొట్టించారు. అప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది, ఇలాంటి విషయాలు ఫోకస్ చేస్తూ ఈ సినిమా సాగుతుందన్నారు.
యు.పి.ఎ, ఎన్.డి.ఎ ప్రభుత్వాలు పారిశ్రామిక వేత్తలను కన్నబిడ్డల్లాగా చూస్తూ రైతులను సవతి బిడ్డల్లా చూస్తున్నారు. వేల కోట్లు రుణాలు ఎగ్గొడుతున్న పారిశ్రామిక వేత్తలను ఏమీ అనడం లేదు. వారికి రుణాలు మాఫీ చేస్తున్నారు. కానీ రైతులను మాత్రం రుణాలు కట్టమని వేధిస్తున్నారు అన్నారు.

స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి, రైతులకు కూడా రుణ మాపీలు చేయాలి, దళారీ వ్యవస్థను రూపు మాపి, ప్రభుత్వమే పంటను కొని రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాలి అని నారాయణ మూర్తి అన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మీద నారాయణ మూర్తి ప్రశంసలు గుప్పించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టని రైతు సంక్షేమ పథకాలను ఆయన ప్రవేశ పెట్టారని, పంట పెట్టుబడి కోసం ఎక్కడా అప్పులు చేయకుండా ముందుగానే ఎకరాకు నాలుగువేల రూపాయలు ఇస్తుండటాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











