అక్కినేని నాగార్జున ఫ్యామిలీ ప్లానింగ్?
హైదరాబాద్: ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఫ్యామిలీ ప్లానింగ్ అంటే మరేదో ఊహించుకోవద్దు. నాగార్జున తన ఫ్యామిలీ వృక్షాన్ని మరింత బలంగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనేదే టైటిల్‌లోని ఉద్దేశ్యం. నాగార్జున కేవలం నటుడు మాత్రమే కాదు, తెలివైన వ్యాపార వేత్త కూడా. అఫ్ కోర్స్ ఇదంతా ఆయన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నుంచి పునికి పెచ్చుకున్నదే అనుకోండి!
అక్కినేని నాగేశ్వరరావు నటుడిగా నిలదొక్కుకున్న తర్వాత అన్నపూర్ణ స్టూడియో నిర్మించి సినిమా వ్యాపారంలోకి దిగారు. ఆయన తనయుడు నాగార్జున అటు నటుడిగా నిలదొక్కుకోవడంతో పాటు తండ్రి వ్యాపారాన్ని మరింత అభివృద్ధి పరిచి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు.
ఇవే కాకుండా...బాగా డబ్బు సంపాదించడానికి వీలైన అన్ని వ్యపారాల్లోనూ నాగార్జున వేలు పెడుతున్నారనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాయేతర వ్యాపారాలు నాగార్జున చాలా చేసారు, చేస్తున్నారు కూడా. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా డిస్ట్రిబ్యూషన్ సంస్థ స్థాపించి ఆ రంగంలోనూ వ్యాపారం మొదలు పెట్టారు.
తొలి ప్రయత్నంలో భాగంగా 'భాయ్' చిత్రాన్ని ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూట్ చేసిన నాగార్జున నష్టపోయారని చెప్పకతప్పదు. అయితే తొలిప్రయత్నం విఫలమైనా ఏ మాత్రం బెదురు లేకుండా ముందుకు సాగుతున్నారు నాగార్జున. తాజాగా రూపొందుతున్న అక్కినేని ఫ్యామిలీ మల్టీ స్టారర్ మూవీ 'మనం' చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట నాగార్జున.
నాగార్జున డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టడానికి ప్రధాన కారణం.....సినిమా రంగంలో తన ఫ్యామిలీ పట్టు తగ్గకుండా ఉండేందుకే అని ఫిల్మ్ నగర్ టాక్. ఇతర డిస్ట్రిబ్యూటర్లను నమ్ముకుంటే తమ ఫ్యామిలీ హీరోల సినిమా విడుదల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో తక్కువ థియేటర్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందనేది నాగార్జున అభిప్రాయమట.
ఇప్పటికే మెుగా, నందమూరి, ఘట్టమనేని, మంచు ఫ్యామిలీలు....తమ కంటే ముందు అడుగులో ఉన్నారు. ఈ నేపథ్యంలో పోటీని తట్టుకునేందుకు సినిమా రంగంలో తన ఫ్యామిలీని మరింత బలంగా చేసేందుకు ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు సాగుతున్నారు నాగార్జున. అదన్నమాట నాగార్జున ఫ్యామిలీ ప్లానింగ్ విశేషాలు.


Click it and Unblock the Notifications












