రామ్ గోపాల్ వర్మ కొత్త కుంపటి: మార్పు సాధ్యమేనా?
హైదరాబాద్: న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆవిర్బావం గురించి రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన ప్రెస్ నోట్.
నా 25 ఏళ్ల కెరీర్ లోకి వెనక్కి చూసి, ఆ తర్వాత టెక్నలాజికల్ అడ్వాన్సెస్ అనబడే, దిక్సూచి నుంచి ముందుకి చూస్తే తెలుగు సినీ పరిశ్రమ చాలా పాతబడిపోయింది అనేది చాలా క్లియర్ గా అర్ధమవుతుంది. ప్రపంచంలో ప్రతిదీ పాతబడవలసిందే! మార్పు అనేది రావాలసిందే.
'పాత' అనే పదం తప్పు కాదు. ఎందుకంటే, పాత నుంచే కొత్త పుడుతుంది. ఎప్పటికప్పుడు జింక పిల్లలా కొత్తపుంతలు తొక్కుతూ, క్రియేటివిటీకి పుట్టినిల్లులా ఉండాల్సిన సినిమా, నేడు పురావస్తు స్థితికి ఎందుకు చేరుకుందా, అని నేను ఒక పరిశీలకుడి టైపులో ఆలోచిస్తే, వైవిధ్యాన్ని అంగీకరించలేని, మార్పుకి ఎదురీదే, కరుడుకట్టిన OTFI (Old Telugu Film Industry) ఆలోచనా విధానమే అనది స్పష్టంగా అర్ధమయింది.
తెలుగు సినిమా తొలి అడుగులు వేసినప్పటి నుంచీ ఇప్పటివరకూ, చాలా కొత్త కొత్త పరికరాలు వచ్చాయి. కానీ, వాటిని వాడే వాళ్ళ ఆలోచనలకి మాత్రం బూజుపట్టిపోయింది. మానసిక ఎదుగుదల లేని ఫార్ములాలని పట్టుకుని వేలాడే OTFI వాళ్ళ చేతలు, సినిమా పరిశ్రమని, పైకి ఎగరనివ్వకుండా, పాతాళానికి తొక్కుతున్నాయి.

NTFI (న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ) ముఖ్య ఉద్దేశ్యం, ఒక చట్రంలో ఇరుక్కుపోయిన OTFI కబంధ హస్తాల నుంచి బయటపడటం. ట్రెడిషన్ పేరుతో, ట్రెండ్ కి తగినట్టు మారలేకపోవడంతో, తెలుగు సినిమా పరిశ్రమని,OTFI ఒక జలగలా పట్టి పీడిస్తుంది. కాలానుగుణంగా మారలేని దేన్నైనా, టైం కాలరాచి పారేస్తుంది. బాలీవుడ్ తో మొదలుకుని, దేశంలోని మిగతా సినిమా ఇండస్ట్రీలన్నీ, వైవిధ్యం వెంట పరుగులు పెడుతుంటే, మనం మాత్రం ఇంకా అదూ ఫార్ములాలనూ, ఫార్మాట్ లనూ, పట్టుకుని గబ్బిలాల్లా వేలాడుతున్నాం. కారణం భయం! ఫెయిల్ అవుతామేమో అన్న భయం. పెట్టుబడులు వెనక్కి రావేమోనన్న భయం. కానీ విజయం అందుకోలేమేమోనన్న భయంతో, వైవిధ్యాన్ని వదులుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే, నేడు 90% సినిమాలు, మూస పద్ధతులను అవలంబించి, చిత్రీకరణ జరుపుకుంటున్నవే. అయినా సరే, బాక్సాఫీస్ దగ్గర ఎందుకు బోల్తా కొడుతున్నాయి? పెట్టుబడుల గురించి భయం అంగీకరించదగినదే. ఆలోచించవలసినదే. ఎందుకంటే, పెట్టుబడులు వెనక్కి రావంటే, అసలుకే మోసం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ భయాన్ని అర్ధం చేసుకునే, 'ఐస్ క్రీమ్' పద్ధతిలో, సినిమాలు రూపొందిస్తే, సినిమా విజయావకాశాల పట్లా, విడుదలయ్యాక లాభాల పట్లా, నిర్మాతకున్న, అన్ని భయాలనూ దూరం చేస్తాయి. సినిమా చరిత్రలోనే 'సహకార సినిమా నిర్మాణం' అనే ఒక అతికొత్త నిర్మాణ పద్ధతికి నాంది పలికింది 'ఐస్ క్రీమ్' పద్ధతి. కోల్పోయేదేమీ లేనప్పుడు, నష్టాల బారిన పడే అవకాశమే లేనప్పుడు, ఇంక వెనకడుగు వేయాల్సిన అవసరం ఏమిటి?
OTFI పాత ఆలోచనా విధానాల వల్ల, విసిగి వేసారెత్తిన, సినీ ప్రేమికులకూ, సినీ శ్రామికులకూ, NTFI ఒక వినూత్నమైన వేదిక అవుతుంది. ఇక్కడ ఫెయిల్ అవుతామేమోనన్న భయం ఉండదు. ఫార్మాట్లకి కట్టుబడాల్సిన అగత్యం ఉండదు. ఫార్ములాల వెంట పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. ఇక్కడుండేదంతా, కేవలం క్రియేటివిటీ, కొత్తదనమే! OTFI అడుగు వేయడానికి భయపడి, వెనకడుగు వేసిన మార్గంలోనే, తపన, తెగువ తోడుగా, NTFI తన తొలి గంతులు వేయబోతుంది.
ప్రపంచవ్యాప్తంగా మన పరిశ్రమ కూడా ఉందనే గుర్తింపు వచ్చేదెప్పుడు? మనం ప్రపంచస్థాయిలో సినిమాలు తీసినప్పుడు మాత్రమే! అనితరసాధ్యంలా అనిపించే, హాలీవుడ్, జర్మన్, ఫ్రెంచ్ సినిమాల సరసన మనం నిలవాలంటే, అది కేవలం NTFI వల్ల మాత్రమే సాధ్యం. OTFI అది పీడకలలోనైనా, ఆలోచిస్తుందని నేననుకోను.
సినీపరిశ్రమకీ, 'ఈగ', 'మగధీర', 'బాహుబలి' లాంటి చిత్రాలు చాలా అవసరమేనన్నది కాదనలేని నిజం. అవి మన సినిమా స్థాయిని పెంచుతాయనడంలో, ఎటువంటి సందేహం లేదు. కానీ, ఎప్పుడో పండగలా వచ్చే, అలాంటి సినిమాలను ఆధారం చేసుకుని, ఒక పూర్తి స్థాయి ఇండస్ట్రీ నడిచి, నిలబడుతుందనుకోవడం అవివేకం. అనుభవం లేకున్నా పక్షపాతం వల్లా, పట్టుదల లేకున్నా పరిచయాల వల్లా, నేడు ఇండస్ట్రీలో, ఎంతో మంది తిరుగుతున్నారు. దీనికి NTFI ఆపోజిట్ గా ఉంటుంది.
NTFI నమ్మే సూత్రం ఒకటే, 'జీరో బడ్జెట్, హై కాన్సెప్ట్స్'. ఒక మూసపద్ధతిలో ఇమడలేని, ఒక చట్రంలో ఇరుక్కుపోలేని వారిని, తీరాలని చేర్చడానికి ఐడియాల పడవలని తయారుచేస్తుంది NTFI. NTFI లో స్పూన్ ఫీడింగ్ ఉండదు, బ్రెయిన్ ఫీడింగ్ ఉంటుంది. ఇక్కడ ఎవరి చేతుల్లోనూ, ఎవరి రాతలూ ఉండవు. ఎవరి తలరాతను, రాసుకునేది వాళ్ళే! పెట్టుబడి లేకుండా, ప్రేక్షకుడి దగ్గరకు సినిమాని ఎలా తీసుకెళ్ళాలో NTFI సూచిస్తుందంతే. ఆ సూచనలను బట్టి, ఎవరికి వాళ్ళు, వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి, నిర్ణయాలు తీసుకోవడాన్ని, ఎంకరేజ్ చేస్తుంది NTFI. దీన్ని కార్యరూపంలో పెట్టడానికి, ఒక NTFI వెబ్ సైట్ పెట్టబోతున్నాం. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాం.
NTFI వెబ్ సైట్ చేయాలనుకుంటున్న పనులు:
1) సినిమాగా రూపొందగలిగే ఆలోచనలనూ, కాన్సెప్ట్ లనూ గుర్తించడం, వాటిని డెవలప్ చేయడం. 2) నిర్ధిష్టమైన కార్య, కాల ప్రణాళికలను రూపొందించడం. 3) సినిమా చిత్రీకరణను ఆన్ లైన్ లో పర్యవేక్షించడం. 4) సినిమాకూ, ప్రేక్షకుడికీ మధ్య అడ్డుగోడలా ఉండే, అన్ని OTFI అడ్డంకుల మీద నుంచి దూకడం. NTFI కి సంబంధించిన, మిగతా విషయాలు, NTFI వెబ్ సైట్ లో పెట్టబడతాయి.
తెలుగు సినీ నిర్మాణ రంగం ముఖాన్ని మార్చి, దాన్ని, గోడకి అటు వైపు విసిరే, ఎన్నో నూతన సాధనాలూ, ఇంకా నూతన సాంకేతిక పరికరాలూ, నేడు మార్కెట్ లో ఉన్నాయి. కొత్తదనాన్ని కోరుకునే ఫిల్మ్ మేకర్స్ కి, వాటికి సంబంధించిన వివరాలను, NTFI వెబ్ సైట్ లో, పెడతాము. NTFI ముంబర్స్, ఈ వెబ్ సైట్ లో, తమ తమ అనుభవాలు, ఎప్పటికప్పుడు అప్ లోడ్ చెయ్యవచ్చు. NTFI ని సరిగా అర్ధం చేసుకోలేని వారు, దీని వల్ల, ఎంతో మంది తమ ఉపాధిని కోల్పోతారు అని భ్రమపడవచ్చు, భయపెట్టనూవచ్చు. కానీ, ఈ సైట్ ద్వారా, NTFI కేవలం ప్రతిభని పెంచే విధానాన్ని మాత్రమే ప్రోత్సహిస్తుందనీ, ఎవరి ఉపాధికీ, దీని వల్ల ఆటంకం ఉండదన్నది సుష్పష్టం చేస్తున్నాం. తన విధివిధానాల ద్వారా, NTFI, అందరిలో పారదర్శకతనూ, నిజాయితీనూ, జవాబుదారీతనాన్నీ పెంపొందిస్తుంది.
సినిమా అనేది భారీతనంతో కూడుకున్నదనీ, దాన్ని రూపొందించాలంటే భారీ మొత్తంలో బడ్జెట్ అవసరం అని తెలియనితనంతో నొక్కిచెప్పే OTFI విధానాలను, కడిగిపారేసేలా, NTFI ఉండబోతోంది. సినిమా అనేది కేవలం సృజనాత్మకతతో కూడిన ప్రక్రియ అనీ, దాన్ని అక్కున చేర్చుకోవాలంటే అకుంఠిత దీక్ష, సినిమా అంటే అపారమైన ఇష్టం , కొత్త కొత్త ఐడియాలూ తప్ప, ఇంకేం అవసరం లేదనీ, NTFI నిరూపించబోతోంది.
ఒక సినిమాలో వచ్చే లాభ-నష్టాలు, ఆ సినిమాని రూపొందించడానికి అయ్యే ఖర్చు, ఆ సినిమాని ఇష్టపడే ప్రేక్షకుల తీరు, మీద ఆధారపడి ఉంటుందన్నది, ఎంత బుర్రలేనోడికైనా తెలుసు. కోట్ల ఖర్చుతో రూపొందించిన, ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయిన ఉదాహరణలు, ఎన్నో మనకు ఉన్నాయి. అతి తక్కువ బడ్జెట్ తో తయారయి, పెద్ద పెద్ద విజయాలు అందుకున్న, చిన్న సినిమాలు ఎన్నిటినో, మనం చూస్తూనే ఉన్నాం. తక్కువ బడ్జెట్ సినిమాలు చేయడం NTFI లక్ష్యం కాదు. అంత బడ్జెట్ ఎందుకు, అని ఆలోచింప చెయ్యడమే NTFI లక్ష్యం!
సినిమా అనేది ఎంతో మంది శ్రమకోర్చి, తయారు చేసిన పరిశ్రమ. ఎన్నో విషయాల, ఎంతో మంది వ్యక్తుల సమ్మేళనం. ఇందులో కథ నుంచి మొదలుకుని కథనం వరకూ, నటీనటుల నుంచి మొదలుకుని టెక్నీషియన్స్ వరకూ, మ్యూజిక్, సౌండ్, షాట్ టేకింగ్ లాంటి ఎన్నో ప్రక్రియలు నెలకొని ఉంటాయి. ఇవన్నీ సమకూరాలంటే, ఆ చేసే వాళ్ళందరికీ రెమ్యూనరేషన్ పేరుతో, అర్ధంలేనితనంతో, OTFI తలకు మించిన డబ్బులు చెల్లిస్తూ ఉండడం, మనం గమనిస్తూనే ఉన్నాం. దీని వల్ల సినిమా నిర్మాణం పైన, మోయలేని భారం పడిన దాఖలాలు ఎన్నో, ఎన్నెన్నో!
పారితోషికాలకు NTFI విరుద్దం కాదు. ఒక సినిమా రూపొందించబడడానికి, అవసరమైన అన్ని అంశాలనూ ఒక చోట చేర్చి, అంతా కలిసి తమ మేధస్సునూ, ప్రయత్నాన్నీ కలబోసి, ఒక మంచి సినిమాని తయారు చేసి, సినిమా రిలీజ్ అయ్యాక, వచ్చిన లాభాల్లోంచి, వారి వారి పారితోషికాలను తీసుకోవాలన్నది NTFI ఉద్దేశ్యం. అదే 'ఐస్ క్రీమ్' 'సహకార నిర్మాణ పధ్ధతి'. ఈ పద్ధతి వల్ల, సినిమా తీసే సమయంలో, నిర్మాణ వ్యయం పెరగకపోగా, నిర్మాణ వ్యయం పెరుగుతుందేమో అన్న మీమాంస వల్ల, సినిమాకి క్వాలిటేటివ్ గా, క్వాంటిటేటివ్ గా జరిగే నష్టం తప్పుతుంది. రామ్ గోపాల్ వర్మగా, నా స్థాయిని బట్టి, ఇదేదో నాకొక్కడికే మాత్రమే సాధ్యం అయ్యే పని, అని ఎవరన్నా అనుకుంటే వాడికి బుర్ర లేనట్టే. కొత్త రకమైన సినిమా తియ్యాలన్న ఒక ఆలోచన, ఎంత బాగా తియ్యలన్న తపన ఉంటే చాలు, ఇది ఎవరికైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా సాధ్యమే! నా పేరున్నంత మాత్రాన, 'సత్య 2' కి ఓపెనింగ్స్ రాలేదు. ఏ పేరూ లేని మారుతికి, 'ఈరోజుల్లో'కి ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమాకి రప్పించడానికి, అత్యంత ముఖ్యమైన అవసరం, కరెక్ట్ ట్రైలర్ చెయ్యడం!
'ఐస్ క్రీమ్' సినిమాకొచ్చిన ఓపెనింగ్స్ ని దృష్టిలో పెట్టుకుంటే, మనకి ఒక విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఒక సినిమాకి ఓపెనింగ్స్ రావడానికి, స్టార్ కాస్ట్, సాంగ్స్, ఫారిన్ లోకేషన్స్ లాంటివేవీ అవసరం లేదనీ, OTFI ఢంకా బజాయించి చెప్పుకుంటున్న ఇమేజ్, ప్రొడక్షన్ వాల్యూస్ లాంటివి అక్కరలేదనీ, 'ఐస్ క్రీమ్' లాంటి సినిమాలు అరిచి చెప్పాయి. ఆడియెన్స్ ని కట్టిపడెయ్యడానికి, ఒక తెలివైన, ప్రత్యేకమైన ఆలోచన ఉంటే చాలు. ఇలాంటి వైవిధ్యభరితమైన ఆలోచనలను ప్రోత్సహించలేని OTFI లా కాకుండా, ఎప్పటికప్పుడు సరికొత్త ప్రేరేపించే ఆలోచనా విధానాలను, NTFI ప్రోత్సహిస్తుంది.
ఒకసారి సినిమా అంటూ తీసేసిన తర్వాత, తలాతోక లేని నేటి డిస్ట్రిబ్యూషన్ పద్ధతిలో కాకుండా, NTFI దానిని డైరెక్ట్ గా ప్రేక్షకుల దగ్గరికి చేరుస్తుంది. OTFI లో ఏం జరుగుతుందో, ఒకసారి చెప్పుకుందాం. ఒక ప్రొడ్యూసర్, ఒక సినిమా చేసాక, ఆయా ప్రొడ్యూసర్, డైరెక్టర్, బ్యానర్, ట్రాక్ రికార్డ్, వారి వారి సినిమాలకి అంతకు ముందు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారన్న దృష్టిలో , నిజాం, సీడెడ్, ఈస్ట్-వెస్ట్ లాంటి ఏరియాల నుంచి డిస్ట్రిబ్యూటర్స్, ఆ సినిమాకి ఒక రేట్ ఫిక్స్ చేయడమో, చెయ్యకపోవడమో చేస్తారు.
NTFIలో, ఇందుకు పూర్తిగా విరుద్ధంగా, సినిమాని వేలం వేయడం జరుగుతుంది. సినిమాని ఒక వ్యాపారాత్మకమైన వస్తువుగా పరిగణలోకి తీసుకుంటే, ఇది సులువుగా అర్ధమయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు యొక్క అంతిమ వయాపార లక్ష్యం, వీలైనంత ఎక్కువ మందికొనుగోలుదారులకు చేరడం.. ఇదే సూత్రాన్ని ఆధారం చేసుకుని, NTFI సినిమాలను విడుదల చేస్తుంది. వస్తువు అన్ని చోట్లా ఒకే రకంగా, ఒకే రూపంలో దొరుకుతుంది కాబట్టి, దాని ప్రభావం అందరి మీదా, ఒకేలా ఉంటుంది. కానీ, సినిమా అలా కాదే! సినిమా అన్నది భావోద్వేగాల సమ్మేళనం. దాని ప్రభావం, అందరి మీదా ఒకేలా ఉండాలన్న నియమం ఏం లేదు. అది ఒక్కొక్కరి మీద ఒకోలా ఉంటుంది.
సినిమా ఎలా ఆడుతుందో, ముందుగా ఎవరికీ అంతుచిక్కనప్పుడు, ఎవరో ఒకరిద్దరు డిస్ట్రిబ్యూటర్లనబడే అపోహల, వారి ఆలోచనల మీద ఆధారపడిన, OTFI విధివిదానం వల్ల ఎంతో రిస్క్ ఉంది. సినిమా విజయావకాశాలను బేరీజు వేయడం అనే ప్రక్రియ, ఒకట్రెండు ఏరియాలకు, ఒకరిద్దరు వ్యక్తులకు పరిమితం చేయకుండా, అందరికీ అందుబాటులో, ఎవరికి సాధ్యపడినంతలో వారికి, అమ్మకానికిఉంచడమే NTFI ధ్యేయం.
ఉదాహరణకి, ఒక సినిమాకి పాలకొల్లులో ఎంత రేట్ పలకాలి అనేది, ఎక్కడో హైదరాబాద్ లోనో, ఏ భీమవరంలోనో, కూర్చున్నవ్యక్తి నిర్ణయించడం ఏంటి? పాలకొల్లులో ఫలానా సినిమాకి ఎంత రేట్ పలకాలి అనేది, అక్కడివాళ్ళు నిర్నయించలేరా? అదే సినిమాకి శ్రేయస్కరం, సులభతరం కూడా. ఇలాగే ఇరు రాష్ట్రాల్లో ఉన్న, వందల కొద్దీ సెంటర్లలో, ఎక్కడివాళ్లు, ఆయా ఏరియాల్లో రేట్లు ఫిక్స్ చేయవచ్చు. ఈ విధానం ఎవరైనా, ఎక్కడైనా అవలంబించవచ్చు. ఈ విధంగా, సినిమా వల్ల ఒచ్చే లాభ-నష్టాలు, ఒకరిద్దరికే పరిమితం కాకుండా, అందరికీ అందుతూ, సినిమా నిర్మాణ రంగంలోకి, వారి వారి స్థాయిననుసరించి, ఎవరైనా అడుగుపెట్టే, అవకాశం కల్పిస్తుంది.
ఆలోచించడానికి, ఆచరణలో పెట్టడానికి ఇదెంత సులభతరం అంటే, అంతా కలిసి డబ్బులు పోగుచేసుకున్న గుంటూర్ లోని ముగ్గురు-నలుగురు స్టూడెంట్స్ గానీ, వైజాగ్ లో కిట్టీపార్టీ ఏర్పాటు చేసుకున్న గృహిణులు గానీ లేదా ఏ IT కంపెనీలో జాబ్ చేసుకుంటున్న ఇద్దరు ఫ్రెండ్స్ గానీ, ఎవరైనా, ఎక్కడైనా, సినిమా కొనుక్కోవచ్చు. సినిమాతో వ్యాపారం చేయచ్చు. ఇన్ని రోజులూ, సినిమా చూసేవాళ్లనూ, తీసే వాళ్ళనూ వేరు చేస్తున్న, ఈ సన్నని గీతని, NTFI చెరిపేస్తుంది. ఇకనుంచీ సినిమా చూసేవాళ్ళే, తీసేవాళ్ళు , సొంతం చేసుకునేవాళ్ళు!
NTFI మోడల్ లో, ఒక సినిమా తీసాక, దానికి సంబంధించిన ట్రైలర్, యూట్యూబ్ లో విడుదల అవుతుంది. సినిమా నిర్మాణానికి అయినఖర్చుని బట్టీ, పబ్లిసిటీని బట్టీ, ఆ సినిమాకి, ఫలానా సెంటర్ కి, ఫలానా బేస్ రేటు అని నిర్ణయించబడి, వెబ్ సైట్ లో ఉంచబడుతుంది. ప్రొడక్షన్ హౌస్ కీ, వేలంలో పాల్గొనే వారికీ మధ్య, అనుసంధానంగా, ఒక ఆన్ లైన్ కౌంటర్ కూడా తెరిచి ఉంటుంది. నిర్నీతమైన వ్యవధి వరకూ, ఆ సినిమాకి సంబంధించిన ఆక్షన్ జరుగుతుంది. వేలంలో, ఆ సెంటర్ కి హయ్యెస్ట్ బిడ్ వచ్చాక, ఫలానా సెంటర్కి, బిడ్ చేసిన వ్యక్తి యొక్క వివరాలు, వెబ్ సైట్ లో పెట్టబడతాయి. ఆ ఏరియావరకూ, ఆ సినిమా యొక్క సర్వహక్కులూ, బిడ్ చేసిన వ్యక్తికి ఇవ్వబడతాయి.
ఉదాహరణకి, సినిమా తీసిన ప్రొడక్షన్ హౌస్, ఆ సినిమాకి, బేస్ రేట్ 50 రూపాయలుగా నిర్దారించిందనుకోండి. ఆన్ లైన్ వేలం లో పాల్గొన్న వ్యక్తులలో, ఎవరైనా ఆ సినిమాకి, ఫలానా సెంటర్ కి 70 రూపాయలు బిడ్ చేశారనుకుందాం. కానీ, సినిమా, ఆ సెంటర్ లో 60 రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసిందనుకుందాం. ఈ పరిస్థితుల్లో, ఆ వ్యక్తి 10 రూపాయలు నష్టపోతాడు. అలా కాకుండా, ఆ సెంటర్ లో, ఆ సినిమా 100 రూపాయలు కలెక్ట్ చేసిందనుకుందాం. అతనికి 30 రూపాయలు లాభం వస్తుంది.
అన్ని ఏరియాల్లో, అన్ని సెంటర్లకై, వేలంలో పాల్గొన్న వ్యక్తుల నుండి సేకరించిన డబ్బులతో, ప్రొడ్యూసర్ థియేటర్స్ బుక్ చేస్తాడు. సినిమాకి పబ్లిసిటీ చేస్తాడు. ఎంత పబ్లిసిటీ ఉంటే, వేలంలో సెంటర్లుపాడుకున్నవారికి, అంత లాభం కదా! ప్రింట్స్ వేయిస్తాడు. సినిమా విడుదల అయ్యాక, థియేటర్స్ ద్వారా వసూళ్ల నుంచి, వేలంలో పాల్గొన్న వ్యక్తులకు, డబ్బులు చెల్లించడం జరుగుతుంది.
ఒకవేళ, ఆశించినట్టు జరగకపోతే, మానవప్రయత్నం తప్ప, ఇందులో మనం కోల్పోయిందేo లేదు. OTFIలోలాగా, కోట్లు కుమ్మరించి, సినిమాలు తీసి, వాటిని కొనుగోలు చేసే బయ్యర్లు, నిర్మాతలు, ఇద్దరూ నష్టపోవడం కంటే, ఇదెంతో మేలు కదా!
OTFI అనే పదప్రయోగం, వ్యక్తులను ఉద్దేశించింది కాదనీ, తెలుగు సినీపరిశ్రమలో నేడు నెలకొన్న, వ్యవస్థాగతమైన ఆలోచనా లోపాలను, ఎత్తిచూపే ప్రయత్నమేనని మనవి.
-రామ్ గోపాల్ వర్మ


Click it and Unblock the Notifications











