నేటి సినిమా కథలపై అక్కినేని ఆవేదన..సూచన
మంచి సినిమాలు రాకపోవడానికి కారణం కథలు లేకపోవడమే..అందులో సందేహం ఎందుకు? కొత్తగా ఆలోచించేవాళ్లు తక్కువైపోతున్నారు. ఆ సినిమాలో ఓ ముక్క, ఈ సినిమాలో ఓ ముక్క కలిపేసి కథలు అల్లేస్తున్నారు. ఆరు పాటలూ, నాలుగు ఫైట్లు ఉండాల్సిందే. ఈలోగా కథ అటకెక్కేస్తోంది అంటున్నారు సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన ఈ రోజు 87 పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో చర్చిస్తూ..మంచి కథలు ఎక్కడున్నాయో అన్వేషించాలి. రాసుకున్నవాళ్లు ట్రంకు పెట్టెలో దాచుకొంటే లాభం ఏముంది? 'ప్రేమనగర్', 'ప్రేమాభిషేకం' కథలు ఎలా దొరికాయి? వాటిని అన్వేషించాం. విజయాలు సాధించాం. అలాగని కోట్లరూపాయలు పెట్టుబడి పెడుతున్నవాడిని ప్రయోగాత్మక సినిమాలు తీయమంటే ఎలా? డబ్బులు రావొద్దూ. కానీ ఓ హీరోని నిలబెట్టి, నాలుగు పాటలు పెట్టి సినిమా లాగేద్దాం అనుకోకూడదు. హీరో వల్ల కథ కాదు. కథలే హీరోని తయారు చేయాలి. 'దేవదాసు' సినిమా దేశాన్ని ఉద్ధరించాలని తీశామా? అందులోనూ వ్యాపార విలువలు ఉన్నాయి కదా? అయితే ఏదీ శృతి మించకూడదు అన్నారు. ఆయన సూచనలు ఈ తరానికి ఆదర్శప్రాయమేననటంలో సందేహం లేదు. ఇక ఈ మహానటుడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.


Click it and Unblock the Notifications











