ఎన్టీఆర్ మాదిరిగానే అక్కినేని ఘాట్..! (ఫోటోలు)
హైదరాబాద్: ఇటీవల పరమపదించిన తెలుగు సినిమా దిగ్గజం, దాదాపు పాల్గే అవార్డు గ్రహీత, నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావుకు తెలుగు సినిమా ప్రముఖులు ఘనంగా నివాళి అర్పించారు. శుక్రవారం ఏపీ ఫిల్మ్ చాంబర్లో జరిగిన సంతాప సభలో పాల్గొన్న పలువురు ప్రముఖులు అక్కినేని సినీ రంగానికి చేసిన సేవలను కొనియాడారు.
ఎన్టీఆర్ మాదిరిగానే అక్కినేనికి కూడా ఘాట్ నిర్మించాలని పలువురు వక్తలుఅభిప్రాయ పడ్డారు. అక్కినేని జీవితం తెరిచిన పుస్తకమని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. తాను అక్కినేని నాగేశ్వర రావు హీరోగా నటించిన ప్రేమనగర్ చిత్రం ద్వారానే సినీరంగంలో స్థిరపడ్డానని ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు చెప్పారు. తనలాంటి ఎందరో నిర్మాతలకు అక్కినేని అండగా నిలిచారని ఆయన అన్నారు. అక్కినేని క్రమశిక్షణ గల వ్యక్తి అని ఆయన అన్నారు. అక్కినేనిని ఆయన నిర్మాతల నటుడిగా అభివర్ణించారు.
స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని విశేషాలు....

అక్కినేని సంతాప సభ-1
అక్కినేని సేవలు మరిచిపోలేనవని పరచూరి వెంకటేశ్వర రావు అన్నారు. దేవుడ్ని అంతగా నమ్మని అక్కినేని నాగేశ్వర రావును, దేవుడిని విశ్వసించిన ఎన్టీ రామారావును దేవుడు సమానంగా చూశారని, వారిద్దరు తెలుగు సినీ పరిశ్రమకు భీష్ముడిలాంటివారని ఆయన అన్నారు.

అక్కినేని సంతాప సభ-2
తెలుగు ప్రజలు ఉన్నంత వరకు అక్కినేని అమరజీవి అని ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరి రావు అన్నారు. సంపాదనను అక్కినేని ఎక్కువగా సినీ పరిశ్రమ అభివృద్ధికే వెచ్చించారని, స్టూడియోల నిర్మాణానికి స్ఫూర్తి ప్రదాత అక్కినేని అని ఆయన అన్నారు. అక్కినేని వ్యక్తి కాదు, సంస్థ అని ఆయన అన్నారు.

అక్కినేని సంతాప సభ-3
తాను సినీ పరిశ్రమలోకి దర్శకుడిగా రాలేదనీ అక్కినేని అభిమానిగా వచ్చానని ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు. తన సంభాషణలను అక్కినేని తాను చెప్పడానికి అవకాశం ఇచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. అభిమానులను అక్కినేని తనతో సమానంగా చూసేవారని చెప్పారు.

అక్కినేని సంతాప సభ-4
అక్కినేనితో తనకు గల అనుబంధాన్ని గిరిబాబు నెమరేసుకున్నారు. అక్కినేనిని ఆయన దేవుడిగా అభివర్ణించారు.

అక్కినేని సంతాప సభ-5
గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అక్కినేని ఈ నెల 22న మరణించారు. 23న ఆయన అంత్యక్రియలు జరిగాయి.

అక్కినేని సంతాప సభ-6
కృష్ణా జిల్లా వెంకటరాఘవ పురంలో 1920 సెప్టెంబర్ 20న ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన అక్కినేని వయస్సు 91 సంవత్సరాలు. 1944లో సినీ ప్రస్థానం మొదలెట్టిన నాగేశ్వరరావు తొలి చిత్రం ధర్మపత్ని. చివరి చిత్రం మనం. ఆయన ధరించిన ఎన్నో పాత్రలు చిరస్మరణీయాలై మిగిలిపోయాయి.


Click it and Unblock the Notifications











