గుణశేఖర్ ‘రాణిరుద్రమ’లో అనుష్క ఖరారు!
హైదరాబాద్: అరుంధతిగా అదరగొట్టి భాక్సాఫీస్ రికార్డులు బ్రద్దలు కొట్టిన అనుష్క త్వరలో రాణి రుద్రమ దేవి కనిపించనుంది. దర్శకుడు గుణశేఖర్ రాణి రుద్రమ దేవి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చాలా హీరోయిన్లను పరిశీలించిన తర్వాత అనుష్క లేదా నయన తారను ఫైనల్ చేసిన గుణ శేఖర్‌కు చివరకు అనుష్కను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈవిషయమై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.
జేజమ్మగా అరుంధతిలో అదరకొట్టిన అనుష్క అయితే బావుంటుందని కొందరు కాదు..సీతమ్మ తల్లిగా శ్రీరామ రాజ్యంలో నిలిచిపోయిన నయనతార అయితే బెస్ట్ అని మరికొందరు ఆయనకు సలహాలు ఇచ్చారు. అయితే గుణశేఖర్ ఇద్దరికీ స్క్ర్రిప్టు చెప్పాడని, అయితే ఇద్దరిలో ఎవరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వండా లేట్ చేసారని, చివరకు అనుష్క ఇందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
గుణశేఖర్ వరస ప్లాపుల్లో ఉండటంతో ఏ హీరోయిన్ కూడా ఆయన సినిమాలో చేయటానికి పెద్దగా ఆసక్తి చూపటం లేదు. చివరకు అనుష్క గుణశేఖర్‌పై నమ్మకంతో ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రానికి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్ర స్క్రిప్ట్ కోసం దాదాపు పదేళ్లుగా గుణశేఖర్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. సాంకేతికంగా అత్యున్నతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. 12వ శతాబ్ధంలోని కాకతీయ సామ్రాజ్యం నేపథ్యంలో చారిత్రాత్మక చిత్రంగా దీన్ని దర్శకుడు గుణశేఖర్ రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో 'రుద్రమదేవి'గా టైటిల్ పాత్ర చేయనుంది.
ప్రస్తుతం అనుష్క తెలుగులో నాగార్జున కథానాయకుడిగా శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహిస్తున్న 'డమరుకం' చిత్రంలోనూ, తమిళంలో విక్రమ్‌తో 'శివతాండవం', ఆర్యతో 'ఇరండం ఉళగం' చిత్రాల్లో అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే. శివతాండవం చిత్రం ఈ రోజు విడుదల కాగా... డమరుకం చిత్రం కూడా ఇదే నెలలో విడుదల కాబోతోంది. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత అనుష్క దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించనున్న 'రుద్రమ దేవి' చిత్రంలో నటించనుందని సమాచారం.


Click it and Unblock the Notifications











