కాళహస్తీశ్వరుని సేవలో నాగచైతన్య, అనుష్క
చిత్తూరు: జిల్లాలోని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని బుధవారం నాగచైతన్య, అనుష్క వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయంలోని సహస్రనామ లింగం వద్ద రాహుకేతు పూజలు చేసుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. గురుదక్షిణామూర్తి వద్ద స్వామి అమ్మవార్ల జ్ఞాపికను ఆలయ ఈవో శ్రీరామచంద్రమూర్తి అందజేశారు.
అనుష్క బుధవారం వాయులింగేశ్వరుని దర్శనార్థం వచ్చారు. త్రినేత్ర అతిథి గృహం నుంచి ఆమెను బందోబస్తుతో ముక్కంటి దర్శనార్థం తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు వచ్చిన కొందరు మీడియా పట్ల అనుచితంగా వ్యవహరించారు. ఆలయానికి వచ్చినా ప్రశాంతత లేకుండా పోతోందంటూ అనుష్క మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు.
విషయాన్ని తెలుసుకున్న ఈవో శ్రీరామచంద్రమూర్తి అక్కడకు చేరుకొని మీడియా ప్రతినిధులపై ఆగ్రహానికి గురయ్యారు. ఎంతో దూరం నుంచి.. వచ్చే భక్తులకు ప్రశాంతత కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈవో సర్ధి చెప్పారు. అనుష్కతో పాటు ఫొటోల్లో పడేందుకు పలువురు అభిమానులు పోటీలు పడ్డారు. మహద్వారం నుంచి లోనికి వెళ్లే సమయంలోనూ అభిమానులు ఆమె వెంట ఉన్నారు. గందరగోళ పరిస్థితి నెలకొనకుండా ఆలయ భద్రతా ఉద్యోగులు జాగ్రత్త పడ్డారు.


Click it and Unblock the Notifications











