కహానీ-గర్భం దాల్చనున్న అనుష్క!
హీరోయిన్ అనుష్క త్వరలో సిల్వర్ స్క్రీన్‌పై గర్భం దాల్చబోతోంది. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన 'కహానీ' చిత్రానికి రీమేక్‌గా తెలుగు/తమిళంలో రూపొందుతున్న చిత్రంలో అనుష్క దాదాపుగా ఖరారైంది. కహానీ చిత్రంలో విద్యాబాలన్ పోషించిన గర్భవతి పాత్రను అనుష్క ఇందులో పోషించనుంది.
కొన్ని రోజుల క్రితం 'కహానీ' చిత్రాన్ని స్వయంగా వీక్షించిన అనుష్క.....అందులో విద్యా బాలన్ పోషించిన పాత్ర పట్ల ఆసక్తిని పెంచుకుంది. తను తనకు ఈ చిత్రంలో నటించాలని ఉందంటూ....ఆ చిత్రం దక్షిణాది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న నిర్మాతలకు సంకేతాలు పంపింది.
కనిపించకుండాపోయిన తన భర్త గురించి ఒక ఎన్‌ఆర్‌ఐ గర్భిణి చేసే అన్వేషణే ఈ కహానీ చిత్ర కథ. అనేక హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి చేసిన ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించడంతో తెలుగులో కూడా చేయడానికి నిర్మాతలు తహతహలాడుతున్నారు.
విద్యాబాలన్ పండించిన ఆ పాత్రకు అనుష్క అయితేనే న్యాయం చేయగలదని అంటున్నారంతా. ఈ సినిమాపై అనుష్క సానుకూలంగా ఉండటం గమనార్హం. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ కహానీ దక్షిణాది వెర్షన్లను నిర్మించడానికి సిద్ధమైంది. సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలు పెట్టి సంక్రాంతి నాటికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనుష్క ప్రస్తుతం తెలుగు, తమిళం ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆమె కార్తీ హీరోగా రూపొందుతున్న 'శకుని' చిత్రంతో పాటు, ఆర్య హీరోగా రూపొందుతున్న 'ఇరండమ్ ఉలగం' చిత్రంలో, విక్రమ్ సరసన 'తాండవం' చిత్రంలో, నాగార్జున 'డమరుకం' చిత్రంలో, ప్రభాస్ వారధి చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











