నాక్కొంచెం సిగ్గు ఎక్కువ, ఆ సీన్ చేసినప్పుడు కళ్లు తిరిగినంత పనైంది: అనుష్క
Recommended Video

అనుష్క.. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్‌గా కనిపించే వ్యక్తి. ఆమె నవ్వితే ఎంత బాగుంటుందో.. కత్తి పట్టుకుని కదనరంగంలోకి దూకితే అంతే రౌద్రపూరితంగా ఉంటుంది. అందుకే అందం-అభినయం కలగలిసిన నటీమణుల్లో అనుష్క ముందు వరుసలో ఉంటారు. ఈనెల 26న 'భాగమతి' సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా మీడియాతో ఆమె పంచుకున్న పలు విశేషాలు..

భాగమతి-అరుంధతీ.. పోలికపై?:
ఒక సినిమాను మరో సినిమాతో పోల్చడం సరికాదు. నా కెరీర్‌లో నేనింతవరకు చేసిన సినిమాలకు ఇది భిన్నమైనది. పోలికలు వెతకడం కష్టం. 'అరుంధతి' కథ ఒక టైప్ ఆఫ్ జానర్, 'భాగమతి' మరో ప్రయాణం. అయితే 'అరుంధతి'ని ఆదరించినట్లే 'భాగమతి'ని కూడా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది.

భాగమతి.. థ్రిల్లర్ సినిమానా?, హారర్?..
థ్రిల్లర్ సినిమానే. ట్రైలర్ లో చూపించనదాని కంటే ఎక్కువగా సినిమాలో చూడొచ్చు. ఈమధ్య నా ప్రతీ క్యారెక్టర్ ను ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నా. అలాంటి వాటినే ఒప్పుకుంటున్నాను.

థ్రిల్లర్, హారర్ సినిమాలంటే ఇష్టమా?
లేదు.. చాలా భయం. అలాంటి సినిమాలే చూడను. ఇలాంటి కథలో నన్ను నేను చూసుకుంటే ఎలా ఉంటుందోనన్న ఆసక్తితోనే ఈ కథ ఒప్పుకున్నా. పైగా యూవీ క్రియేషన్స్ మూవీ. ప్రొడక్షన్ పరంగా రాజీ పడరని ఓకె చేశాను.

ఎలాంటి సినిమాలు ఎక్కువగా చూస్తారు?
లవ్ స్టోరీలంటే చాలా ఇష్టం. రొమాంటిక్ కామెడీ సినిమాల్ని అసలు వదిలిపెట్టను. వరలడ్ సినిమాలు కూడా చూస్తాను. వాటివల్లే ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఉంటుంది.

మీ జీవితంలో అతిపెద్ద సాహసం:
'బిల్లా' షూటింగ్ సమయంలో పైనుంచి కిందకు దూకే సీన్ ఒకటి షూట్ చేశారు. ఏదోలా పూర్తి చేసేయొచ్చులే అనుకుని ధైర్యంగా వెళ్లాను. కానీ షాట్ పూర్తయ్యాక కళ్లు తిరిగినంత పనైంది. నాకు ఎత్తయిన ప్రదేశాలంటే చచ్చేంత భయం..

పెళ్లిపై..:
పెళ్లిపై నాకేం వ్యతిరేకత లేదు. తప్పకుండా చేసుకుంటా. కానీ పలానా వ్యక్తితో నా జీవితం పంచుకుంటే హ్యాపీగా ఉండాలని అనిపించినప్పుడే చేసుకుంటా. అదే అభిప్రాయం నన్ను చూసి తనకీ కలగాలి.

నాక్కొంచెం సిగ్గు ఎక్కువే:
మీడియాతో ఇప్పుడిప్పుడు మాట్లాడుతున్నాను కానీ ఫోటోలకు పోజులు ఇవ్వాలంటే మాత్రం ఇబ్బందిగా ఫీలవుతా. నాక్కొంచెం సిగ్గు ఎక్కువ.. కానీ సెట్స్ లోకి వెళ్తే అన్నీమర్చిపోతాను. సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. దానికి ప్రత్యేకమైన కారణమేది లేదు.


Click it and Unblock the Notifications











