10 ఏళ్ల నిరీక్షణకు దక్కిన అపూర్వ విజయం .. పవన్ గెలుపుతో మెగా ఫ్యామిలీ కంటతడి
పవన్ కళ్యాణ్ అభిమానుల పదేళ్ల నిరీక్షణ ఫలించింది. పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేనాని ఘన విజయం సాధించారు. ఎన్నో అవమానాలను, ఛీత్కారాలను, హేళనలను పంటి బిగువున భరించి ఈ అపూర్వ విజయాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. తనే కాదు తాను నిలబెట్టిన 21 మంది జనసేన అభ్యర్ధులను కూడా గెలిపించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించారు. ఇకపై జనసేనకు గాజు గ్లాస్ గుర్తు పర్మినెంట్‌గా ఉండిపోనుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారింది పిఠాపురం. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో ఈ నియోజకవర్గం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన జనసేనాని.. రెండు చోట్లా ఓడిపోయారు. ఈసారి మాత్రం వ్యూహాత్మకంగా పిఠాపురాన్ని ఎంచుకున్నారు. కాపు సామాజికవర్గంతో పాటు మెగాభిమానులు పెద్ద సంఖ్యలో ఉండటంతో బాగా ఆలోచించి పిఠాపురం నుంచి పవన్ బరిలో నిలిచారు.

ఆయన కోసం మెగా ఫ్యామిలీ, సినీ పరిశ్రమ కదిలొచ్చింది. నాగబాబు, వరుణ్ తేజ్, సాయిథరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, జానీ మాస్టర్, ఆర్కే సాగర్ తదితరులు ప్రచారం నిర్వహించారు. ఆయనను ఓడించేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ సైతం అదే స్థాయిలో వ్యూహాలు అమలు చేశారు. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురంలో బరిలో నిలిపారు. క్లీన్ ఇమేజ్ ఉండటంతో పాటు కాపు సామాజికవర్గం, పైగా స్థానికురాలు కావడంతో గీత కూడా పవన్‌కు గట్టిపోటీ ఇస్తారని విశ్లేషకులు సైతం అంచనా వేశారు. కానీ అందరి లెక్కలను తలకిందులు చేస్తూ జనసేనాని ఘన విజయం సాధించారు.
ఈ విజయాన్ని పవన్ అభిమానులు, సన్నిహితులు ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులైతే భావోద్వేగానికి సైతం గురయ్యారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పిఠాపురంలోని పవన్ నివాసం నుంచి వీక్షించారు ఆయన కుటుంబ సభ్యులు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు ఆయన సోదరి విజయదుర్గలు కేరింతలు కొట్టారు. ఈ క్రమంలో పవన్ విజయాన్ని చూసి విజయదుర్గ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు పవన్ కళ్యాణ్ పెద్దన్నయ్య , మెగాస్టార్ చిరంజీవి సైతం తమ్ముడి విజయానికి పొంగిపోతున్నారు. '' డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు గేమ్ ఛేంజర్‌వి మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!..నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని , విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను '' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా చిరంజీవి అభినందనలు తెలియజేశారు. '' ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను '' అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











