అల్లు అర్జున్ అరెస్ట్ ఎందుకు .. రేవంత్ రెడ్డి దూకుడుపై పురంధేశ్వరి షాకింగ్ కామెంట్స్
పుష్పా 2 దేశవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తుండగా.. ఆ సినిమాలో నటించిన హీరో అల్లు అర్జున్ వివాదంలో చిక్కుకున్నారు. పుష్ప 2 విడుదలకు ముందు రోజు హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె బిడ్డ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
అరెస్ట్ చేసిన అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్ట్ రిమాండ్ విధించగా.. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే అప్పటికే అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించగా టెక్నికల్ కారణాల కారణంగా రిలీజ్ ఆలస్యమైంది. దీంతో రాత్రంతా ఆయన జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాతి రోజు తెల్లవారుజామున అల్లు అర్జున్‌ను జైలు అధికారులు విడుదల చేశారు. అక్కడి నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన బన్నీ కాసేపటి తర్వాత ఇంటికి వెళ్లారు. అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టడం వివాదాస్పదమైంది. బాధిత కుటుంబాన్ని ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదని.. అలాంటి అల్లు అర్జున్ ఒక్క రాత్రి జైలులో ఉండి వచ్చేసరికి ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటి ముందు వాలిందని సోషల్ మీడియా హోరెత్తిపోయింది.

తాజాగా అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రకటన చేశారు. పోలీసులు రావొద్దని చెప్పినప్పటికీ హీరో వినిపించుకోలేదని.. రోడ్లపై ఊరేగింపులా, రోడ్ షో చేసుకుంటూ వచ్చారని ఆరోపించారు. ఆయన సైలెంట్‌గా సినిమా చూసి వెళితే ఏ గొడవ ఉండేది కాదని.. కానీ కారు రూఫ్ టాప్‌పై నిలబడి చేతులు ఊపుకుంటూ వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగి నిండు ప్రాణం బలైపోయిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ బయట ఇంత జరుగుతున్నప్పటికీ ఆయన సినిమా చూస్తూ కూర్చొన్నారని .. పోలీసులు పలుమార్లు అల్లు అర్జున్‌ను బయటికి పంపించేయాలని ప్రయత్నించినప్పటికీ థియేటర్ యాజమాన్యం అడ్డుకుందని ముఖ్యమంత్రి తెలిపారు.
ఇలాంటి మానవత్వం లేని వాళ్లని ఒక రోజు జైలులో వేసినందుకు చిత్ర పరిశ్రమ మొత్తం నాపై కక్ష కట్టి తిడుతోందని సీఎం ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్‌కు కాలు పోయిందా, కన్ను పోయిందా, కిడ్నీలు పోయాయా ఆయనను ఎందుకు అంతమంది పరామర్శించారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా గంటల వ్యవధిలో మీడియా సమావేశం పెట్టిన అల్లు అర్జున్ జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోయిన విషయం నాకు తెల్లవారే వరకు తెలియదని , బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తానంటే బన్నీ వాస్ వెళ్లనివ్వలేదని అల్లు అర్జున్ వెల్లడించారు.
తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించారు ఏపీ బీజేపీ చీఫ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి. హీరోగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారని.. ఇది ఆయన ప్రేరేపించింది కాదన్నారు. కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. బాధితులకు అల్లు అర్జున్ అండగా నిలుస్తానని హామీ ఇస్తున్నాడు కదా అని ఆమె గుర్తుచేశారు. ప్రస్తుతం పురందేశ్వరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











