గుడ్‌న్యూస్ చెప్పిన రేణుదేశాయ్ .. ఆ ఫోటోలతో షాకిచ్చిందిగా
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడిపోయారన్న పేరే కానీ పవన్ - రేణూ కలిసే ఉన్నారా అన్నంతగా వారి భావాలు ఉంటాయి. ఇప్పటికీ వీరిద్దరూ ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలు పంచుకుంటూనే ఉంటారు. తాజాగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
తన సినిమాలు, సోషల్ సర్వీస్‌తో పాటు సమాజంలో నిత్యం జరుగుతున్న అంశాలపై స్పందిస్తూ ఉంటారు రేణు దేశాయ్. గతేడాది తన ఎన్జీవో సంస్థ రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో పాటు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో తన సామాజిక కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు. మూగ జీవాల సంక్షేమం కోసం రేణూ దేశాయ్ తన జీవితాన్ని అంకితం చేశారు. తనకు తోచిన సాయం చేయడంతో పాటు ఆన్‌లైన్‌లోనూ విరాళాలను అభ్యర్ధిస్తుంటారు రేణూ దేశాయ్.

రేణు దేశాయ్‌కి దైవభక్తి కూడా ఎక్కువే. ప్రతి నెలలో వచ్చే పండుగలు, విశిష్ట పర్వదినాలలో ఖచ్చితంగా ఇంట్లో పూజలు చేయాల్సిందే. వీలు కుదిరినప్పుడల్లా ప్రముఖ ఆలయాలకు వెళ్లి దేవుడి సేవలో తరిస్తుంటారు. తను ఒక్కటే వెళ్లకుండా పిల్లలు అకీరా నందన్, ఆద్యలను కూడా తీసుకెళ్తూ వారికి భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కల్పిస్తుంటారు. ఇటీవలే రేణూ తన పిల్లలతో కలిసి కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు.
పవన్ కళ్యాణ్‌ను పెళ్లాడిన తర్వాత తన సినీ జీవితానికి గుడ్ బై చెప్పిన రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2003లో పవన్ కళ్యాణ్‌కు జంటగా జానీలో కనిపించిన రేణు దేశాయ్.. దాదాపు 20 ఏళ్లకు రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించారు. సామాజికవేత్త హేమలత లవణం పాత్రలో రేణూ దేశాయ్ తళుక్కున మెరిశారు. మళ్లీ ఆ తర్వాత ఆమె కొత్తగా ఏ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పలేదు.
రేణూ దేశాయ్‌ని వెండితెరపై చూడాలని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఆవిడ ఓకే చెప్పాలే కానీ దర్శక నిర్మాతలు ఇంటి ముందు క్యూకడతారు. అలాగే రేణు దేశాయ్‌కి తగ్గ పాత్రల్ని సృష్టించడానికి రచయితలు కూడా రెడీగా ఉన్నారు. కానీ ఆమె వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. ఎన్నోసార్లు మీడియా ప్రతినిధులు రేణు దేశాయ్ రీ ఎంట్రీ గురించి ప్రశ్నించగా.. ఆమె సున్నితంగా సమాధానం దాటవేశారు.

తాజాగా రేణు దేశాయ్ శుభవార్త చెప్పినట్లే కనిపిస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏదో షూటింగ్‌లో పాల్గొన్నట్లుగా హింట్ ఇచ్చారు. బ్రేక్ టైమ్‌లో స్నాక్స్ తినడంతో పాటు కేరవాన్ ఫోటోను కూడా షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరి రేణు దేశాయ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారా? లేక మరేదైనా సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











