ఏపీలోనూ హైడ్రా.. రేవంత్ నుంచి మొత్తం రాబట్టిన పవన్, ఇక లెక్కలు తేల్చడమే !!
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు ఆక్రమించి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేసిన వారి భరతం పడుతోంది హైడ్రా. ప్రముఖుడైనా సామాన్యుడైనా ఒకటే ట్రీట్‌మెంట్. ఈ దెబ్బతో ఎవరింటి మీదకు బుల్డోజర్లు దూసుకొస్తాయోనని పలువురు బిగ్‌షాట్‌ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీంతో కొందరు తమ పలుకుబడిని ఉపయోగించి రాజీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. హైడ్రా తరహా యాక్షన్ ప్లాన్‌ను తమ దగ్గరా అమలు చేయాలని కొన్ని రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇందులో ముందున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ గ్రాఫ్ పడుతూ లేస్తూ సాగుతోంది. ఎప్పుడైతే హైడ్రా తెరమీదకి వచ్చి పని మొదలుపెట్టిందో నాటి నుంచి రేవంత్ రెడ్డికి జనంలో మాస్ ఇమేజ్ వచ్చింది. చాలా అక్రమ కట్టడాలను ఈ టీమ్ కూల్చివేసినప్పటికీ.. టాలీవుడ్ అగ్రనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ట పెరిగింది. నాగార్జుననే వదలని వాడు మమ్మల్నెందుకు వదిలేస్తాడని పలువురు బడా బాబులు భావిస్తున్నారు.

నాగార్జున తర్వాత టాలీవుడ్‌లోనే మరో బిగ్‌షాట్ మురళీ మోహన్‌కు చెందిన జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు హైడ్రా నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని రంగలాల్ కుంట సమీపంలోని జయభేరి అపార్ట్‌మెంట్ బఫర్ జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు హైడ్రా తన నోటీసుల్లో పేర్కొంది. అయితే హైడ్రా నోటీసుల్లో పేర్కొన్న అంశాలు నిజమేనని అంగీకరించిన మురళీ మోహన్ బుల్డోజర్లు పంపాల్సిన అవసరం లేదని తామే కూల్చేస్తామని చెప్పారు.
కాగా.. హైడ్రా పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి వ్యవస్థ ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు బుడమేరు పొంగి విజయవాడ మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పవన్ హైడ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన పవన్ కళ్యాణ్ ఆయనతో కీలక విషయాలు చర్చించారు.
వర్షాలు, వరదల నేపథ్యంలో ఏపీ , తెలంగాణలకు చెరో కోటి రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్. దానితో పాటు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పంచాయతీ రాజ్ శాఖలో 400 పంచాయతీలకు రూ. లక్ష చొప్పున రూ.4 కోట్లు విరాళం ప్రకటించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెక్కును అందజేశారు. దీనిలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.
ఇక ఇద్దరు నేతల భేటీలో హైడ్రా అంశం చర్చకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. హైడ్రా ఏర్పాటుకు కారణాలు, విధి విధానాలు వంటి వాటిని పవన్‌కు రేవంత్ వివరించినట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరింత అధ్యయనం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించి హైడ్రాను అక్కడా రంగంలోకి దించడం ఖాయమేనని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











