రోజాకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. ముఖ్యంగా వర్తక, వాణిజ్యానికి, రాజకీయాలకు గుండెకాయ వంటి విజయవాడ నగరం జలదిగ్భంధంలో చిక్కుకుపోయింది. ఏకధాటిగా కొద్దిగంటల పాటు కురిసిన వర్షం ధాటికి బుడమేరు వాగు పొంగి ఊరు వాడా ఏకమయ్యాయి. నగరంలోని కీలక ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి.
సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు. 74 ఏళ్ల వయసులోనూ మోకాలి లోతు నీళ్లలో తిరుగుతూ బాధితులకు నేనున్నాననే భరోసా నింపుతున్నారు. అయితే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదంటూ విపక్ష వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై స్వయంగా పవన్ స్పందించారు.

ఏకధాటిగా కురిసిన కుంభవృష్టి ధాటికి బుడమేరు పొంగి విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. ఊహించని వరదతో నగరంలోని అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, జక్కంపూడి, వాంబే కాలనీ వంటి ఏరియాల్లో ఇల్లు మునిగిపోయాయి ఆయా ప్రాంతాలు నదిని తలపిస్తున్నాయి. పిల్లలతో కట్టుబట్టలతో మిగిలిన ప్రజలు భవనాలపైకెక్కి సాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు 24 గంటలూ శ్రమిస్తున్నా కొందరికీ సాయం అందడం లేదు.
సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. కాన్వాయ్‌ని పక్కనబెట్టి జేసీబీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం.. హెలికాఫ్టర్‌లో ఏరియల్ సర్వే ద్వారా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆహారం, తాగునీరు, మందులను డ్రోన్లు, హెలికాఫ్టర్ల ద్వారా చేరవేస్తూనే ఉన్నారు.
అయితే అధికారులు ఇంతగా శ్రమిస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా ఆరోపణలు చేశారు. భారీ వర్షాలపై వాతావరణ శాఖ రెండ్రోజుల ముందే హెచ్చరించినా పవన్ కళ్యాణ్ తన శాఖను ఎందుకు అప్రమత్తం చేయలేదని ఆమె ప్రశ్నించారు. ఆయన ఐదురోజులుగా విజయవాడకే రాలేదని రోజా మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌కు ప్రజలను కాపాడాలనే చిత్తశుద్ధి లేదని, కూటమి ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనమంటూ ఆమె ధ్వజమెత్తారు.
దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా కౌంటరిచ్చారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని.. తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలనుకున్నానని చెప్పారు. కానీ తన వల్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదనే దూరంగా ఉన్నట్లు పవన్ చెప్పారు. మీరొస్తే రిలీఫ్ ఆపరేషన్‌కు ఇబ్బంది అవుతుందని అధికారులు సూచించడంతోనే తాను ఆగిపోయానని డిప్యూటీ సీఎం వెల్లడించారు.
సహాయక చర్యల్లో అధికారులు బాగా అలిసిపోయి ఉన్నారని .. తన పర్యటన ప్రజలకు సహాయ పడేలా ఉండాలి తప్పించి.. అధికారులకు అదనపు భారం కాకూడదన్నారు. తాను బోటులో ఆ ప్రాంతాలకు వెళితే జనం ఒక్కసారిగా మీద పడిపోతారని, అది మరిన్ని సమస్యలకు దారి తీస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. సహాయక పునరావాస కార్యక్రమాల్లో తన శాఖ క్షేత్రస్థాయిలో శ్రమిస్తోందని.. తనపై విపక్షాలు నిందలు వేయాలని తప్పించి, మరొకటి కాదని రోజాకు పవన్ కౌంటర్ ఇచ్చారు. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











