Bhola Shankar Ticket Rates: చిరంజీవికి ఝలక్ ఇచ్చిన ఏపీ సర్కార్.. విమర్శలే కారణమా?
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం భోళా శంకర్. ఎనిమిదేళ్ల క్రితం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వేదాళం సినిమాకు రీమేక్ గా వస్తోన్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటి తమన్నా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్లుగా చేస్తున్నారు.
ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న అంటే ఇంకా రెండు రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు ఇటీవల చిరంజీవి ఏపీ సర్కారుపై చేసిన విమర్శలే కారణంగా చర్చ నడుస్తోంది.

చిరు విమర్శలు: ఆగస్టు 11న విడుదలకు సిద్దంగా ఉన్న భోళా శంకర్ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ లుక్స్ టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల వాల్తేరు వీరయ్య 200 డేస్ ఫంక్షన్ లో చిరంజీవి చేసిన కామెంట్స్ బీభత్సంగా వైరల్ అయ్యాయి. ఎప్పుడూ వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడే చిరు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

బిగ్ షాక్: అభివృద్ధి, పోలవరంపై ప్రాజెక్ట్సుపై దృష్టిపెట్టాలని కానీ, సినీ ఇండస్ట్రీపై ఎందుకు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా చేస్తున్నారంటూ తమ్ముడు పవన్ కల్యాణ్ కు సపోర్ట్ గా మాట్లాడారు చిరంజీవి. ఈ వాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ఘాటుగా ఖండించారు. ఈ వ్యవహారంపై పెద్ద చర్చే సాగింది. అయితే తాజాగా చిరంజీవి వ్యాఖ్యలకు ధీటుగా ప్రభుత్వం షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

అసంపూర్తిగా: భోళా శంకర్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల పెంపునకు ఇంకా అనుమతి లభించలేదన్న విషయం తెలిసిందే. ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు సర్కారును భోళా శంకర్ మూవీ యూనిట్ కోరింది. అందుకు దరఖాస్తు కూడా చేసుకుంది. అయితే ఆ దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, పలు డాక్యుమెంట్లు జత చేయలేదని టికెట్ల పెంపునకు ప్రభుత్వం తిరస్కరించిందని తాజాగా వచ్చిన సమాచారం. మరి దీనిపై ఏపీ సర్కారు తుది నిర్ణయం ఎలా ఉంటుందో ఇంకా తెలియరాలేదు.

నిబంధనలకు లోబడి: అయితే ఓవైపు ప్రభుత్వాన్ని విమర్శించి మరోవైపు భోళా శంకర్ టికెట్లు పెంచమని కోరడంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కాగా టికెట్ల పెంపు అనేది ఏపీ ప్రభుత్వం అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం. ఎందుకు అంటే టికెట్లు ఇష్టారాజ్యంగా పెంచుకునే హక్కు నిబంధనల ప్రకారం సినిమా యూనిట్లకు లేదు. ఆయా రాష్ట్రాల్లోని నిబంధనలకు లోబడే టికెట్ల పెంపు అనేది ఉంటుంది.

నటీనటులు: ఇక చిరంజీవి భోళా శంకర్ సినిమాను ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర సమర్పణలో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. రావు రమేష్, మురళి శర్మ, రవి శంకర్, రఘు బాబు, వెన్నెల కిశోర్, శ్రీముఖి, బిత్తిరి సత్తి, ప్రగతి, రష్మీ గౌతమ్, తరుణ్ అరోరా, గెటప్ శ్రీను, కాశీ విశ్వనాథ్, సితార, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు నటిస్తున్నారు. డూడ్లీ సినిమాటోగ్రఫీ, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.


Click it and Unblock the Notifications











