Tollywoodకి గుడ్ న్యూస్.. ఏపీలో 100 శాతం ఆక్యుపెన్సీ.. టికెట్ రేట్ల పెంపు మీద క్లారిటీ?
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై కొంత కాలంగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం ఓ స్టీరింగ్ కమిటీని కూడా నియమించింది. ఇప్పటికే పలు సార్లు భేటీ అయిన ఈ కమిటీ చివరి భేటీ గురువారం నాడు జరిగింది. ఆ భేటీలో ఏం జరిగింది? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అనే వివరాల్లోకి వెళితే

తుది చర్చలు
చాలా కాలం నుంచి ఏపీలో టికెట్ రేట్ల విషయంలో టెన్షన్ పడుతున్న టాలీవుడ్‌కు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఏపీలో సినిమా టికెట్ల రేటు నిర్ధారించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ చివరి సారిగా నివేదికపై ఇప్పుడు తుది చర్చలు జరుగుతున్నాయి. గురువారం నాడు సచివాలయంలో భేటీ అయి, సినిమా టికెట్ల వివాదం, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించింది.

99 శాతం అనుకూలంగా
ఈ సమావేశానికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశ్వజిత్, ఇతర సభ్యులు హాజరయ్యారు. మీటింగ్ పూర్తయిన క్రమంలో ప్రభుత్వానికి నివేదికను అందించింది. ఇక టికెట్ రేట్ల వ్యవాహారం సహా అన్ని వివాదాలకి చెక్ పడనుందని అందరూ భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రామదాసు మీడియాతో మాట్లాడారు. టికెట్ల రేట్లు గురించి అన్ని అంశాలను చర్చించామని, కమిటీ అడిగిన వాటికి 99 శాతం ప్రభుత్వం అనుకూలంగా ఉందని తెలిపారు.

అతి త్వరలోనే
సినిమా టికెట్ల ధరలు మూడు శ్లాబుల్లో ఉండనున్నట్లు చెప్పారు. అతి త్వరలోనే దీనిపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని పేర్కొన్నారు. కాగా.. ఇకపై థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీ ఉంటుందని, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. ఫిల్మ్ ఛాంబర్ తో చర్చించి మేము రేట్లు ప్రభుత్వానికి సూచించామని, అతి త్వరలో ఫైనల్ నిర్ణయం ప్రభుత్వం తీసుకుని ప్రకటిస్తుందని అన్నారు. ఇండస్ట్రీ కోసమే చిరంజీవి చర్చలు జరిపారన్న ఆయన 100 కోట్ల బడ్జెట్ కంటే ఎక్కువ ఉన్న సినిమాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని నిర్ణయం ఉంటుందని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

10 రోజుల సమయం
అయితే మరోవైపు సదరు కమిటీ ఇచ్చిన నివేదికను ఏపీ ప్రభుత్వం పరిశీలించి దానిపై నిర్ణయం తీసుకునేందుకు కనీసం 7 నుంచి 10 రోజులు అయినా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తక్కువలో తక్కువ మరో 10 రోజుల్లో సినిమా టిక్కెట్ల ధరలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. జీవో 35 ప్రకారం నాలుగు ప్రాంతాలను మూడు ప్రాంతాలుగా మార్చి కమిటీ సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు.

మార్పులు ఏమంటే?
అంతకు ముందు గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ గా ఉండగా ఇప్పుడు గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ కలిపి నగర పంచాయతీ ఏరియాగా సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. మూడు క్లాసులకు గాను రెండే క్లాసులు ఉండేలా ఎకానమీ, ప్రీమియం రెండే క్లాసులను సిఫార్సు చేసినట్టు చెబుతున్నారు. చూడాలి ఈ అన్ని విషయాలకు సంబందించిన జీవో ఎప్పుడు రాబోతుంది అనేది.


Click it and Unblock the Notifications











