Indian 2: సినిమా టికెట్ రేట్లు పెంపు.. రాష్ట్ర సర్కార్ ను ఇరుకున పెట్టిన హైకోర్టు
ఎప్పుడూ లేనిది ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక సినిమా టికెట్ల వ్యవహారం వివాదాస్పదమైంది. సినిమా వచ్చిందా , వెళ్లిందా అన్నట్లుగా ఉండే పరిస్ధితిపై ప్రభుత్వ అజమాయిషీ పెరగడంతో చిత్ర పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రైవేట్ ఫ్లాట్ ఫామ్స్ కాకుండా ప్రభుత్వమే వెబ్ పోర్టల్ ద్వారా టికెట్ల విక్రయాలను పర్యవేక్షించాలని చూసింది. అలాగే బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు పర్మిషన్లను ఎత్తివేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు దాదాపు 60 శాతం ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఏపీలో ఈ పరిస్ధితులు రావడంతో ఇండస్ట్రీ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోంది. పరిశ్రమను ఆదుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు నాటి సీఎం వైఎస్ జగన్‌ను కలిసింది కూడా.
దీనిపై సానుకూలంగా స్పందించిన జగన్ ప్రభుత్వం.. సినిమా బడ్జెట్‌ను బట్టి టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ వస్తున్నారు. కానీ కొన్ని సినిమా టికెట్ల ధరల పెంపునకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. అలాంటి వాటిలో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ కూడా ఉంది. అయితే తాజా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమకు అనుకూలంగా ఉండే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. పైగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో టాలీవుడ్‌కు మంచి రోజులు వచ్చినట్లుగా భావిస్తున్నారు.

ఇండస్ట్రీ ఎలా కావాలంటే అలా చేసుకోవడానికి వీలుగా తాను జీవో ఇప్పిస్తానని ఇటీవల తనను కలిసిన సినీ ప్రముఖులకు హామీ ఇచ్చార్ పవన్. ఆ కొద్దిరోజులకే ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా రిలీజైంది. దర్శక నిర్మాతల అభ్యర్ధన మేరకు ఈ సినిమా టికెట్ ధరలను రెండు వారాల పాటు పెంచుకోవడానికి, ఐదో ఆట ప్రదర్శించుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కల్కికి మంచి వసూళ్లు వస్తున్నాయి.
ఏపీలో పరిస్ధితులు చక్కబడుతున్న వేళ.. సినిమా టికెట్ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. సినిమా టికెట్ ధరలను పెంచడంపై నెల్లూరుకు చెందిన రాకేష్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ఇంతకీ కొత్తగా రిలీజయ్యే సినిమా టికెట్ల ధరలను పెంచే అధికారం ప్రభుత్వానికి ఉందా, లేదా అనే విషయమై లోతుగా విచారణ చేయిస్తామని తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని, ప్రతివాదులను ధర్మాసనం ఆదేశించింది.

అయితే ప్రస్తుతానికి కల్కికి వచ్చిన ఇబ్బందేమి లేదని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికీ ఈ సినిమా రిలీజై రెండు వారాల సమయం దాటిపోగా.. చాలా చోట్ల టికెట్ ధరలను తగ్గించారు. కానీ హైకోర్టు ఇచ్చే తీర్పు .. రాబోయే రోజులలో రిలీజ్ కాబోయే పెద్ద సినిమాల విషయంలో ప్రభావం చూపించే అవకాశం ఉందని సినీ ప్రముఖులు భయపడుతున్నారు. నెక్ట్స్ పుష్ప 2, దేవర పార్ట్ 1, ఓజీ, ఎన్‌బీకే 109, విశ్వంభర వంటి చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఎలాంటి తీర్పును ఇస్తుందోనని ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











