వైభవంగా ఆర్యన్ రాజేష్ వివాహం
సినీ నటుడు, ఈవివి తనయుడు ఆర్యన్ రాజేశ్ ఓ ఇంటివాడయ్యాడు. జేగురుపాడుకు చెందిన కంటిపూడి ఆమర్‌నాధ్ కుమార్తె సుభాషిణిని శనివారం తెల్లవారుజామున మనువాడాడు. రాజమండ్రి చెరుకూరి కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకలకు సినీ,రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వివాహాన్ని అందరూ వీక్షించేలా స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వివాహా వేడుకను తిలకించడానికి ఇరు కుటుంబాల బంధువులతో పాటు ప్రముఖులు శుక్రవారం రాత్రే అక్కడికి చేరుకున్నారు.
బంధు మిత్రులు, సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో ఉదయం 4 గంటల 18 నిముషాలకు సుభాషిణిని, ఆర్యన్ రాజేశ్ మనువాడాడు. పెళ్ళికి ముందు జరిగిన వివాహ వేడుకల్లో ప్రముఖ సినీనటులు ఉదయ్ కిరణ్, నటి ఆర్చన, నిర్మాత డి.సురేష్, ఆలీ, చలపతిరావు, హీరో వేణు లతో పాటు రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మొదలైన వారు పాల్గొన్నారు. సినీతారలను చూసేందుకు జనం పోటీపడ్డారు. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే రోజున మాదాపూర్ లోని రాక్ గార్డెన్స్‌లో రిసెప్షన్ జరుగనుంది. ఆర్యన్ రాజేష్ కు వన్ ఇండియా తరుపున శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











