భృతికింద ప్రతీనెలా రూ.40వేలివ్వాలి...కోర్టు ఆదేశం
ముంబయి : ప్రముఖ గాయని ఆశాభోంస్లే కుమారుడు హేమంత్ భోంస్లే తన మాజీ భార్యకు మధ్యంతరభృతి కింద ప్రతీనెల 40 వేల రూపాయలు ఇవ్వాలంటూ ఇక్కడి కుటుంబ న్యాయస్థానం ఆదేశించింది. ''హేమంత్ భోంస్లే నెలవారీ భృతి కింద పిటిషనర్ (62 సంవత్సరాల విశ్రాంత గగనసఖి)కు 40,000 చెల్లించాలి. అదీ 2012 మార్చి 20నుంచి కేసు పరిష్కారం అయ్యేంతవరకు'' అని కుటుంబ న్యాయస్థానం జడ్జి ఎస్.ఎ.మోరే తన ఆదేశాల ద్వారా తెలిపారు.
హేమంత్ మరో మహిళతో ఆరు సంవత్సరాలుగా కలిసి నివసిస్తూ తనను ఇంటి నుంచి గెంటేశారని, 2002-03నుంచి తాను, తన భర్త వేర్వేరుగా ఉంటున్నామని హేమంత్ భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రస్తుతం తనకు నెలకు కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే పింఛను వస్తుందని తెలిపింది.

''హేమంత్ స్కాట్లాండ్‌లో నివసిస్తున్నాడు. ఆయన జీవనశైలిని, పిటిషనర్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాం. దీని ప్రకారం కేసు పరిష్కారం అయ్యేంతవరకు ప్రతీ నెల ఆమెకు 40వేల భృతి ఇవ్వవచ్చును'' అని న్యాయస్థానం తెలిపింది. అలాగే కోర్టు ఖర్చుల కింద పదివేల రూపాయలు ఇవ్వాలని ఆదేశించింది.


Click it and Unblock the Notifications











