కేసీఆర్.. ఇలాంటి కుక్కల్ని కాల్చిపడేయండి.. దిల్ రాజు, అల్లు అరవింద్‌పై అశోక్ వల్లభనేని ఫైర్
సూపర్ స్టార్ రజనీకాంత్ పేట చిత్రం తెలుగులో విడుదలవుతుందా అనే అనుమానాలు కొన్ని రోజుల క్రితం వరకు ఉన్నాయి. కానీ తమిళంతో పాటు, తెలుగులో కూడా సంక్రాంతికే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనీ నిర్మాతలు డిసైడ్ అయ్యారు. పేట చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. రజనీ అమెరికాలో ఉండడం వలన ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరు కాలేదు. నిర్మాత అశోక్ వల్లభనేని ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో వల్లభనేని అశోక్ చేసిన వ్యాఖ్యలు వివాదభరితంగా మారాయి.

రజనీకాంత్ స్ఫూర్తితోనే
వల్లభనేని అశోక్ మాట్లాడుతూ.. తాను చిన్న తనం నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ స్పూర్తితో పెరిగానని అన్నారు. మా తండ్రి మరణించిన సమయంలో ఆయన కళ్ళని అవయవ దానం చేశాం. రజనీకాంత్ చేసే సేవా కార్యక్రమాల్ని స్ఫూర్తిగా తీసుకుంటేనే ఇలాంటి గొప్ప పనులు చేయగలం అని అశోక్ వల్లభనేని తెలిపారు. తాను రజనీకాంత్ సినిమాని విడుదల చేసే స్థాయికి చేరుకున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.

వీళ్ళకేంటి నొప్పి
పేట చిత్రానికి థియేటర్స్ ఇవ్వకుండా కొంతమంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని వల్లభనేని అశోక్ తెలిపారు. యువి క్రియేషన్స్, దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి వాళ్లు పేట చిత్రానికి థియేటర్స్ దక్కకుండా అడ్డుకుంటున్నారు. మంచి చిత్రానికి థియేటర్స్ ఇవ్వడానికి వీళ్లకు ఏంటి నొప్పి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకుడు తనకు నచ్చే సినిమా చూడాలని అనుకుంటారు. వీళ్ళు బలవంతగా జనాలపై రుద్దే సినిమాలు మాత్రమే చూడాలా అని ఫైర్ అయ్యారు.

థియేటర్స్ మాఫియా
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మాఫియా కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. ఇలాంటి కుక్కలకు బుద్ది చెప్పి థియేటర్స్ మాఫియాని కడిగేయాలి అని అశోక్ వల్లభనేని ఆగ్రహంతో మాట్లాడారు. నయీమ్ లాంటి వ్యక్తిని షూట్ చేసి ప్రజలకు మంచి చేశారు. థియేటర్ మాఫియాని సాగించే వాలని కూడా షూట్ చేయాలని మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు.

రెండవ వారం నుంచి
ఎన్ని అడ్డంకులు ఎదురైనా సూపర్ స్టార్ రజని పేట చిత్రం రెండవ వారం నుంచి దూసుకుపోతుందని అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, సంగీత దర్శకుడు అనిరుద్ హాజరయ్యారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న హీరోయిన్ మేఘా ఆకాష్ కూడా హాజరైంది. హీరో శ్రీకాంత్, దర్శకుడు వైవిఎస్ చౌదరి అతిధులుగా హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











