టీవీ ఛానల్ పెడుతున్న నిర్మాత అశ్వినీదత్
ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ త్వరలో ఓ కొత్త టీవీ ఛానల్ పెట్టబోతున్నారు. ఆ చానల్‌కు 'మాయా బజార్ టీవీ' అనే పేరు పెడుతున్నట్లు సమాచారం. దత్‌కు సంబంధించిన వైజయంతి మూవీస్ సంస్థతో కలిసి సహారావన్ మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ లిమిటెడ్ ఈ చానల్‌ను రన్ చేస్తాయని తెలుస్తోంది.
గతంలో 'లోకల్ టీవీ'ని స్థాపించిన అశ్వినీదత్ దాన్ని సహారా ఇండియా పరివార్ సంస్థకు అమ్మినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా అదే సంస్థ అశ్వినీ దత్‌తో కలిసి మరో ఛానల్‌ను స్థాపించి వినూత్నమైన, ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ కూడిన కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది. ఈ ఛానల్ పూర్తిగా సినిమాలకు సంబంధించి ఉంటుందని, సినిమాలు, సినిమా వార్తలు, సినిమా రంగంలో జరిగే సంఘటలను కవర్ చేస్తూ కార్యక్రమాలు ఉంటాయని అంటున్నారు.
ప్రస్తుతం అశ్వినీదత్ తన వై జయంతి మూవీస్ బేనర్‌పై రవితేజ హీరోగా 'సార్ వస్తారా' చిత్రాన్ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.
దీంతో పాటు మహేష్, క్రిష్ కాంబినేషన్లో కూడా అశ్వినీదత్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక సమాచారం లేదు. మహేష్ బాబు హీరోగా పరిచయం అయిన 'రాజకుమారుడు' సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్లో రూపొందింది. రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా చేసే ప్లాన్ చేస్తున్నారు.
బాలు, సుభాష్ చంద్రబోస్, జై చిరంజీవ, సైనికుడు, శక్తి... ఇలా వరుస ప్లాపులతో సతమతం అయింది వైజయంతి మూవీస్. దీంతో ఈ సంస్థ అధినేత అశ్వినీదత్ పొగొట్టుకుంది ఎలాగైనా రాబట్టుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే ఈ సంవత్సరం మహేష్ బాబు, రామ్ చరణ్ లతో భారీ ప్రాజెక్టులకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











