జూ ఎన్టీఆర్ ‘శక్తి’ ఇమేజ్ తో మెగా హీరో అవ్వొచ్చు..!?
తెలుగు నిర్మాతలలో అశ్వనీదత్ కు ఓ ప్రత్యేకత వుంది. సినిమా నిర్మాణంలో ఎట్టి పరిస్థితులలోనూ రాజీపడరు. కాంబినేషన్ పరంగా కానీ, బడ్జెట్ విషయంలో కానీ రాజీ అన్నదే ఆయన కెరీర్ లో లేదు. ఆయన నిర్మించిన భారీ చిత్రాలే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు'శక్తి' సినిమా మరో మారు ఆ పేరును నిలబెట్టింది. ఈ సినిమా ఏప్రిల్ 1న రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో అశ్వనీదత్ చెప్పిన విశేషాలు..
'కంత్రీ సినిమా అయ్యాక మళ్లీ జూ ఎన్టీఆర్, మెహర్ రమేష్, నేను ఓ సినిమా చేయాలని అప్పుడే డిసైడ్ అయ్యాం. అయితే, ఈసారి తీసే సినిమా రెగ్యులర్ సినిమా కాకూడదని ముందే అనుకున్నాం. అంటే, ఏదో సంథింగ్ డిఫరెంట్ అవ్వాలనుకున్నాం. అప్పుడు మా 'జగదేక వీరుడు అతి లోక సుందరి'గుర్తొచ్చింది. ఆ సినిమాలా సోషియో ఫాంటసీ చేయాలనుకున్నాం. మెహర్ రమేష్ చెప్పిన కథ ఎన్టీఆర్ కు, మాకు, అందరికీ బాగా నచ్చింది. దానికి హేమాహేమీల వంటి ఇతర రచయితలతో మెరుగులు దిద్దించాం. అలా శక్తి కథ పక్కాగా వచ్చాక సెట్స్ కి వెళ్లాం". తర్వాత ఈ సినిమా పూర్తి చేయడానికి 18 నెలలు పట్టింది. సినిమా స్పాన్ ఎక్కువ. ప్రపంచ ప్రసిద్దిగాంచిన డిఫరెంట్ లోకేషన్లు... నంబరాఫ్ షాట్లు... ఎక్కడా రాజీపడలేదు. అందుకే కాస్త సమయం ఎక్కువపట్టింది. 300 మంది యూనిట్ సభ్యులతో షూటింగ్ చేశాం. అందరూ ఎంతో కష్టపడ్డారు" అన్నారు.
ఇక సినిమా గురించి మాట్లాడుతూ'ఇంత బడ్జెట్ అయినా, ఇంత సమయం పట్టినా.. ఇప్పుడు సినిమా చూస్తుంటే ఏదో తృప్తి.. ఏదో అనుభూతి కలుగుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్ బిగ్గెస్ట్ రేంజ్ కలిగిన (మెగా)హీరో అవుతాడు. అతని ఇమేజ్ అందనంత ఎత్తుకి ఎదుగుతుంది. ఎంత అందంగా ఉన్నాడో చెప్పలేను! ప్రతి డైలాగుకీ ప్రేక్షకుల చేత క్లాప్స్ కొట్టించుకుంటాడు. అద్భుతంగా అభినయించాడు. ఇక ఇలియానా కూడా ఓ దేవతలా కనిపిస్తుంది. ఆమె పాత్ర కథకు కీలకం. అసలు కథ ఆమెతోనే ప్రారంభమవుతుంది. ఆమె గ్లామర్ కి అభినయం తోడవుతుంది.
గతంలో మా 'చూడాలని ఉంది'లో కోల్ కతా నగరాన్నీ, 'ఇంద్ర'లో కాశీ నగరాన్ని చూపించాం. ఇందులో శక్తి పీఠాల విశిష్టతను చూపుతున్నాం. ఇక మెహర్ రమేష్ అయితే టాప్ డైరెక్టర్ అవుతాడు. మామూలుగా మా సినేమాలనగానే అందమైన మరో ప్రపంచం కళ్ళముందు కదలాడుతుంది. అందుకు రాఘవేంద్రరావు గారే కారకులు. మా బ్యానర్ లో ఆయన 12 సినిమాలు చేశారు. ఇప్పుడు మెహర్ మరో రాఘవేంద్ర రావు అనిపించుకుంటారు". అంతే కాదు ఈ సినిమాలో 'ఇతర హైలైట్స్ ఏమిటంటే" మణి శర్మ సంగీతం పెద్ద హైలైట్. ఇంతవరకు మాకు 13 సినిమాలు చేశారాయన. అన్నీ హిట్సే. ఇది కూడా మ్యూజికల్ హిట్. దీనికి తోడూ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద ఎసెట్ అవుతుంది. ప్రాగ్ వెళ్లి కొన్ని ప్రత్యేకమైన వాయిద్యాల సౌండ్స్ మిక్స్ చేయడం జరిగింది. అలాగే, సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ, ఆనంద్ సాయి కళా దర్శకత్వం అన్నీ సినిమాకి ఎంతో హెల్ప్ అవుతాయి. ఓ అద్భుతమైన సినిమా చూసిన అనుభూతిని ప్రేక్షకులు పొందుతారు".


Click it and Unblock the Notifications











