ఆ ఆలోచన నుంచి పుట్టిన కథే 'శక్తి'
మా సంస్థ 'జగదేకవీరుడు- అతిలోకసుందరి' చిత్రాన్ని నిర్మించిన చాలా రోజుల తర్వాత సోషియో ఫాంటసీ కథాంశంతో 'మగధీర' చిత్రం వచ్చింది. సరికొత్త జానర్‌లో రూపుదిద్దుకున్న ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో ఎన్టీఆర్ స్టామినాను ఉపయోగించుకుంటూ అత్యంత భారీ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచన నుంచి పుట్టిన కథే 'శక్తి' అని వివరించారు నిర్మాత అశ్వనీదత్. భారీ తారాగణంతో, అత్యంత భారీ వ్యయంతో రూపుదిద్దుకున్న 'శక్తి' చిత్రం ఏప్రిల్ ఒకటిన విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
అలాగే 'కంత్రి' సినిమా అయిన తర్వాత మరో సినిమా చేయాలని నేను, ఎన్టీఆర్, మెహర్‌రమేష్ అనుకున్నాం. అయితే ఈసారి తీసే సినిమా చాలా ప్రత్యేకంగా ఉండాలని, రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకూడదని కూడా అనుకున్నాం. ఈ సినిమా అయితే కరెక్టు అనుకున్నాం. మెహర్‌రమేష్ చెప్పిన స్టోరీ లైన్ ఎన్టీఆర్‌కు, నాకు బాగా నచ్చింది. హేమాహేమీలైన రచయితలు కథాసహకారాన్ని అందించడంతో చాలా పకడ్బందీగా కథ తయారైంది. 300 మంది యూనిట్ సభ్యులతో 18 నెలల పాటు కష్టపడి ఈ సినిమాని అద్భుతంగా రూపొందించాడు మెహర్‌రమేష్. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బిగ్గెస్ట్ రేంజ్ కలిగిన కథానాయకుడవుతాడు. అలాగే మెహర్ రమేష్ డైరెక్టర్‌గా టాప్ ఛెయిర్‌లో ఉంటాడు అన్నారు.
తెలుగుతో పాటు తమిళంలో 'ఓం శక్తి' పేరుతో ఈ సినిమా ఒకే రోజు విడుదలవుతోంది. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్నాటక... ఇలా నాలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం మరో విశేషం.దీన్ని హిందీలో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇద్దరు అగ్రహీరోలతో సంప్రదింపులు జరుపుతున్నాం. వివరాలు త్వరలో వెల్లడిస్తాను అని అశ్వనీదత్ చెప్పారు. ప్రభు, పవిత్రాలోకేష్, ప్రగతి, కృష్ణభగవాన్, అలీ, వేణుమాధవ్, నాజర్ తదితరులు ఇతర ప్రాతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, రచనా సహకారం: యండమూరి జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్, ఆర్ట్: ఆనంద్‌సాయి, కెమెరా: సమీర్ రెడ్డి, సమర్పణ: సి. ధర్మరాజు, స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: మెహర్ రమేష్.


Click it and Unblock the Notifications











