Attack: పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ గార్డ్ ఇంటిపై దాడి .. అసలేం జరిగిందంటే?
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వెంకట్ అనే వ్యక్తి ఇంటిపై పలువురు దాడికి దిగారు. హైదరాబాద్ మీర్‌పేట్‌లోని లెనిన్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. వెంకట్ ఇంటిపై రాళ్లు, రాడ్లు, కత్తులతో దాడి చేయడమే గాక.. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. వెంకట్ తన భార్య సరితతో కలిసి ఐదేళ్లుగా వారి ఇద్దరు పిల్లలతో కలిసి లెనిన్ సెంటర్‌లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో వారి ఇంటి ఎదురుగా ఉండే రాజు వాళ్ల బంధువులు పాత గొడవల నేపథ్యంలో మే 15న రాత్రి వెంకట్ కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకట్ భార్య సరిత ఓ అబ్బాయిని కొట్టింది. దీంతో కోపోద్రిక్తులైన రాజు బంధువులు వెంకట్ ఇంటిపై కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్లతో దాడి చేసి ఇంట్లోని సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. అంతేకాదు వెంకట్ కుటుంబసభ్యులపైనా దాడి జరిగినట్లుగా తెలుస్తోంది.

ఆయన ఇంటి ముందున్న బైక్‌ను కూడా రాజు బంధువులు ధ్వంసం చేసేందుకు యత్నించారు. ఈలోగా స్థానికులు జోక్యం చేసుకోవడంతో వారు పరారయ్యారు. ఈ ఘటనపై వెంకట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి సెక్యూరిటీ గార్డుపై పనిచేస్తున్న వ్యక్తిపై దాడి నేపథ్యంలో పవన్ అభిమానులు సైతం మండిపడుతున్నారు. దీనికి బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలని వారు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలావుండగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలో దిగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో మాదిరిగానే భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరగ్గా.. అంచనాలకు భిన్నంగా ఆయన పిఠాపురం నుంచి పోటీ చేశారు. పవన్ కోసం మెగా ఫ్యామిలీ కదిలివచ్చింది.
నాగబాబు, వరుణ్ తేజ్, సాయిథరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లు ప్రచారం చేయగా.. చివరి రోజున రాంచరణ్ , తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురానికి వచ్చి పవన్‌కు సంఘీభావం ప్రకటించారు. అలాగే జబర్దస్త్ కమెడియన్స్ సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ తదితరులు పవన్ కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
పవన్ పోటీకి దిగడంతో తెలుగు రాష్ట్రాల్లో పిఠాపురం పేరు మారుమోగుతోంది. అందుకు తగినట్లుగానే ఈసారి భారీ పోలింగ్ శాతం నమోదైనట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పిఠాపురంలో దాదాపు 86.63 శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. 2014లో 79.44 శాతం, 2019లో 80.92 శాతం పోలింగ్ నమోదైనట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.
పోలింగ్ రోజున యువత, మహిళలు, వృద్ధులు ఓటు వేసేందుకు క్యూ కట్టారు. అంతేకాదు.. విద్య, ఉద్యోగం, వ్యాపారం కోసం పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న వారు కూడా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పిఠాపురానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి పవన్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని జనసేన కేడర్ ధీమాగా చెబుతోంది.


Click it and Unblock the Notifications











