రచ్చ రచ్చ... మెగా అభిమానులపై దాడులు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'రచ్చ' సినిమా గురువారం రాష్ట్ర వాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. మెగా అభిమానులంతా థియేటర్ల వద్ద భారీ సంఖ్యలో బారులు తీరడంతో పలు చోట్ల గంధరగోళ పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు, దాడులు చోటు చేసుకున్నాయి.
పాలకొల్లలోని దాసరి పిక్చర్ ప్యాలెస్‌పై అభిమానులు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. శాటిలైట్ ద్వారా సినిమా ప్రదర్శించాల్సి ఉండగా సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో వేరే చోటు నుండి సినిమా రీల్స్ తెప్పించడం లేటయింది. సినిమా ప్రదర్శన లేటు కావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అభిమానులు థియేటర్లో రచ్చ సృష్టించి విధ్వంసానికి పాల్పడ్డారు. ఆ తర్వాత సినిమా ప్రదర్శితం అయినప్పటికీ థియేటర్ ఓనర్‌కి భారీగా బొక్కపడింది.
విజయవాడలో పలు థియేటర్ల వద్ద టిక్కెట్ల కోసం అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. పలువురు గాయ పడ్డారు. దీంతో కౌంటర్లు కొంతసేపు మూసి వేశారు. ఇదే అదనుగా బ్లాక్ టికెట్ గాళ్లు రెచ్చిపోయారు. ఒక్కో టికెట్ రూ. 1500 వరకు అమ్మి మెగా అభిమానుల వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకున్నారు.
ఇక తిరుపతిలో మెగా అభిమానులపై థియేటర్ సిబ్బంది దాడికి తెగబడ్డారు. టిక్కెట్ల కోసం నిలదీసిన అభిమానులను కర్రలతో చితకబాదారు. ఈ ఘటనపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ల యజమానులే కావాలని టిక్కెట్లను బ్లాక్ చేస్తున్నారని మండి పడ్డారు. టిక్కెట్లు లేకుంటే థియేటర్ మూసుకోవాలి కానీ తమపై దాడి చేసే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.
రామ్ చరణ్, తమన్నా జంటగా నటించిన ఈచిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించారు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి ఆర్.బి.చౌదరి సమర్పకులు కాగా, ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్ నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, రచన: పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి, కొరియోగ్రఫీ: రాజు సుందరం, శోబి.


Click it and Unblock the Notifications











