అటాక్: ఇన్నాళ్లూ ఏమైందో తెలియదు... ఇపుడు డేట్ ప్రకటించారు!
హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా ‘అటాక్' అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసింది. చాలా కాలం క్రితమే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఆ మద్య ట్రైలర్లు కూడా విడుదల చేసి హడావుడి చేసారు. ఏమైందో తెలియదు కానీ సినిమా ఇప్పటికీ విడుదల కాలేదు.
అటు మనోజ్ గానీ, ఇటు రామ్ గోపాల్ వర్మ గానీ ఈ సినిమా గురించి ఈ మధ్య ఎక్కడా మాట్లాడలేదు. ఏదో సమస్య ఉండటం వల్లనే ఇలా జరిగిందని అంటున్నారు. తాజాగా సమస్యలు ఓ కొలిక్కి రావడంతో ఆడియో రిలీజ్ డేట్ ప్రకటించారు. ఫిబ్రవరి 5న సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ చేసి... సినిమా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారు. అదే నెలలో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, వడ్డే నవీన్ కీలక పాత్రలు పోషించారు. సురభి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం పూర్తి యాక్షన్, ఫ్యాక్షన్ అంశాలతో తెరకెక్కింది. మంచు మనోజ్ లోని యాక్షన్ కోణాన్ని పూర్తిగా వాడుతున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని దగ్గుపాటి రానా తో అనుకున్నారు...కానీ చివరి నిముషంలో సీన్ లోకి మంచు మనోజ్ వచ్చారు.
మనోజ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అది ఈ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. చాలా కాలం క్రితం హీరో గా రిటైరయ్యి తప్పుకున్న వడ్డే నవీన్ ఇప్పుడు ఈ చిత్రంతో సీన్ లోకి వచ్చారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. మంచు మనోజ్, జగపతిబాబు కాంబినేషన్ లో ఇంతకు ముందు కరెంట్ తీగ చిత్రం వచ్చింది. సికె ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీ శుభశ్వేతా ఫిలింస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది.


Click it and Unblock the Notifications











