సమైక్య సెగ : ‘అత్తారింటికి దారేది’ మళ్లీ వాయిదా!
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఈ నెల 9న కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. తాజాగా ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఆగస్టు 9న విడుదల చేయడం లేదని, ఆగస్టు 14న విడుదల చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 14న కూడా....విడుదలకు అనుకూలంగా పరిస్థితులు ఉంటేనే విడుదల చేస్తారని, లేకుంటే మరికొంత కాలం వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత ఉదృతమైన సమైక్యాంధ్ర ఉద్యమం మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు విడుదలకు అడ్డంకిగా మారింది. చిరంజీవి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని, లేకుంటే ఆయన కుటుంబ సభ్యుల సినిమాలను అడ్డుకుంటామని సమైక్య వాదులు హెచ్చరించారు.
ఇప్పటికే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన 'ఎవడు' సినిమా వాయిదా పడింది. జులై 31న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో ఆగస్టు 21కి వాయిదా వేసారు. 21న కూడా విడుదల అవుతుందా? లేదా? అనేదానిపై కూడా స్పష్టత లేదు.


Click it and Unblock the Notifications












