‘అత్తారింటికి దారేది’ పైరసీ...వారిపైనే అనుమానం?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు ముందే పైరసీకి గురవ్వడంతో పోలీసులు, యాంటీ పైరసీ విభాగం వెంటనే రంగంలోకి దిగారు. తాజాగా అందుతున్న వివరాల ప్రకారం...చెన్నై సినీ ల్యాబ్‌లో ఎడిటింగ్ రూం నుంచి సినిమా బయటకు లీకైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పోలీసులు ఇద్దరు పాత పైరసీ నేరస్తులైన వెంకటేష్(నెల్లూరు), కుమార్(విజయవాడ)లపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు మీడియా టాక్. ప్రస్తుతం వీరిద్దరు పరారీలో ఉన్నారు. విజయవాడలో పైరసీ వెలుగు చూడటంతో కుమార్ అనే పాత నేరస్తుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
కృష్ణా జిల్లాలో 'అత్తారింటికి దారేది' పైరసీ సీడీలు కేవలం రూ. 50కే లభ్యం అవుతున్నట్లు తెలుస్తోంది. పైరసీ విషయమై నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తనయుడు బాపినీడు రాష్ట్ర డిజీపీకి ఫిర్యాదు చేసారు. పైరసీ విజువల్స్ ఎవరూ వాడినా చర్యలు తీసుకుంటామని నిర్మాతలు హెచ్చరించారు.
'అత్తారింటికి దారేది' చిత్రాన్ని అక్టోబర్ 9 విడుదల చేస్తున్నట్లు ఇటీవల నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనుకున్న దానికంటే రెండు వారాల ముందుగా....సెప్టెంబర్ 27నే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా పైరసీకి గురైన నేపథ్యంలో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.


Click it and Unblock the Notifications












