మెగా ఫ్యాన్స్ వర్సెస్ ఉద్యమకారులు (ఫోటో ఫీచర్)
హైదరాబాద్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని సినిమా ఫ్యామిలీగా హవా కొనసాగిస్తున్న మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీ హీరోలు ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సమైక్య ఉద్యమం నేపథ్యంలో ఉద్యమకారులకు, మెగా అభిమానులకు మధ్య వివాదాస్పద వాతావరణ నెలకొంది.
మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని లేకుంటే ఆయన కుటుంబ సభ్యుల సినిమాలు అడ్డుకుంటామని సమైక్యవాదులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జులై 31న విడుదల కావాల్సిన 'ఎవడు' ఆగస్టు 21కి వాయిదా వేసారు. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రం కావడంతో సినిమాను తాజాగా అక్టోబర్ 4కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
మరో వైపు పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం ఆగస్టు 7న విడుదల కావాల్సి ఉండగా......ప్రస్తుతం నెలకొన్న ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో సినిమా విడుదల తేదీని నిలిపి వేసారు. పరిస్థితిని బట్టి త్వరలో విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది. సినిమా రోజు రోజకు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సినిమాలను అడ్డుకుంటే ఊరుకోం అంటూ సమైక్యవాదులకు హెచ్చరికలు సైతం జారీ చేసారు.

మెగా ఫ్యాన్స్ హెచ్చరిక
మెగా హీరోల సినిమాలను విడుదల కాకుండా ఆపితే చూస్తూ వూరుకోబోమని 'చిరంజీవి యువత' పేర్కొంది. సినిమాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యమకారుల పేరిట మా హీరోల బొమ్మలు తగలబెడితే సహించబోమని, కుటిల రాజకీయాలను తిప్పికొడతామని హెచ్చరించారు.

మనోభావాలు దెబ్బతీయొద్దు
అలాగే తెదేపా శాసనసభ్యుడు దేవినేని ఉమమహేశ్వరరావు మొదటి నుంచీ చిరంజీవిపై వ్యక్తిగత కక్షతో విమర్శిస్తున్నారని ఆరోపించారు. మెగా హీరోలపై తాము చూపే అభిమానానికి సరిహద్దులు, ప్రాంతాలు, పార్టీలు లేవని, అభిమానుల మనోభావాలను దెబ్బతీస్తే తగిన గుణపాఠం చెబుతామని పేర్కొన్నారు.

జేఏసీలకు హెచ్చరిక
మరో ప్రక్క పవన్ కళ్యాణ్ అభిమానులు రాష్ట్రంలోని ఉద్యమ జేఏసీలకు హెచ్చరికలు జారీ చేసారు. ఈ మేరకు సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ఉద్యమకారులకు సందేశాలు పంపుతున్నారు. మా హీరో జోలికి రావొద్దు...సినిమాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఎవరినీ లెక్క చేయని అభిమానం
పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అందుకే మేము మొదటి నుంచి అటు తెలంగాణ ఉద్యమానికి గానీ, ఇటు సమైక్యాంధ్ర ఉద్యమానికి సపోర్టు చేయడం లేదు. కానీ మా హీరో జోలికి వస్తే కేవీపీ అయినా, కావూరి అయినా లేదా కేసీఆర్ అయినా లెక్కచేయమని స్పష్టం చేసారు.

ముందే గ్రహించిన చిరు
జులై 31న విడుదల చేసేందుకు ముందుగా డేట్ ఫిక్స్ చేసారు. చరణ్ గత సినిమా మగధీర జులై 31, 2009లో విడుదలై తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. ఈనేపథ్యంలో ‘ఎవడు' సినిమాకు ఇదే డేట్ అని ఫిక్స్ అయ్యారు. కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి విభజనకు ముందు జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అధిష్టానం రాష్ట్ర విభజనపై కీలక నిర్ణయం తీసుకోబోతుందనే విషయం గ్రహించారు. వెంటనే 31న విడుదల కావాల్సిన ‘ఎవడు' సినిమాను నిలిపివేయించారు.

సీమాంధ్రలో ఉద్యమం
ప్రస్తుతం సీమాంధ్రలో ఉద్యమం ఉప్పుడప్పుడే చల్లబడేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ సినిమాలు ఇప్పట్లో విడుదల అవుతాయా? లేదా? అనే విషయంపై అయోమయం నెలకొంది. పరిస్థితి ఇలానే ఉంటే మాత్రం సినిమాలను మరిన్ని రోజులు వాయిదా వేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











