‘ఆటోనగర్ సూర్య' ఆడియో, చిత్రం రిలీజ్ తేదీలు ఫిక్స్
హైదరాబాద్: నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం 'ఆటో నగర్ సూర్య'. దేవాకట్టా దర్శకత్వం వహించారు. మరో 20 శాతం చిత్రీకరణ మిగిలి ఉండగా ఈ సినిమా ఆగిపోయింది. దాదాపు యేడాది పాటు... ఈ సినిమాని ఎవరూ ముందుకు కదల్చలేదు. 'తడాఖా' హిట్ తరవాత ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. మిగిలిన చిత్రీకరణ పూర్తిచేసి ఇప్పుడు విడుదలకు సిద్ధం చేస్తున్నారు. డిసెంబరు 13 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. చిత్రం ఆడియో నవంబర్ 30న విడుదల చేస్తారు.
ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర పేరు సూర్య. అతను అనాథ. కానీ అనామకుడు మాత్రం కాదు. ఆటోనగర్ అంటే ఆ ఊళ్లో అందరికీ తెలుసు. అయితే ఆ పేరు వినబడగానే అక్కడ సూర్య అనే ఓ యువకుడు ఉంటాడనే విషయం కూడా గుర్తుకు తెచ్చుకొంటారు. అదీ అతను సంపాదించిన పేరు. సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి యువకుడి జీవితానికి ఎవరు అడ్డుగా నిలిచారు? వారికి సూర్య ఎలా సమాధానం చెప్పాడు? అనేది సినిమా మెయిన్ స్టోరీ.
విజయవాడ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దేవకట్ట తనదైన స్టైల్లో తెరకెక్కించినట్లు సమాచారం. కె అచ్చి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో ప్రేమ, వినోదాంశాలు కలగలిపి ఈచిత్రం రూపొందుతోంది. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్, సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.


Click it and Unblock the Notifications












