ఆది ‘లవ్‌లీ’మూడు రోజుల కలెక్షన్స్
ఆది, శాన్వి జంటగా బి.జయ దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మించిన చిత్రం 'లవ్‌లీ'. మొన్న శుక్రవారం విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే కలెక్షన్ల రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని దర్శకురాలు బి.జయ తెలియచేయటానికి మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ..నన్ను సంపూర్ణంగా దర్శకురాలిగా నిలబెట్టిన సినిమా ఇది. 'ప్రేమకావాలి' వారం రోజులకు 3 కోట్లు వసూలు చేస్తే... ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే 3 కోట్ల 62 లక్షలు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు'' అన్నారు.
అలాగే... సినిమా తీయడానికి ఎంత టైమ్ తీసుకున్నానో, మంచి కథ తయారు చేసుకోవడానికి అంతకంటే ఎక్కువ టైమ్ తీసుకున్నా. నా కష్టం తెరపై కనిపిస్తోందని నేడు సన్నిహితులు, ప్రేక్షకులు అంటుంటే... చెప్పలేని ఆనందం కలుగుతోంది. 'ప్రేమకావాలి' లాంటి సక్సెస్ తర్వాత ఆది నటించబోయే రెండో సినిమా అతని కెరీర్‌కి చాలా కీలకం. ఆ సినిమాకు నేను దర్శకురాలినవ్వడంతో పెద్ద భారమే నాపై పడింది. కానీ నేను దాన్ని భారంగా కాకుండా... సవాల్‌గా స్వీకరించా అన్నారు.
ఇక సినిమా ఫ్లాప్ అవ్వకూడదు. 'ప్రేమకావాలి' లాంటి సక్సెస్ అయినా సరిపోదు. తప్పకుండా ఘన విజయమే నమోదవ్వాలి అనుకుని దాని కోసం శక్తివంచన లేకుండా కృషి చేశా అని చెప్పుకొచ్చారు.
ఇక ఈ చిత్రం విజయానికి కారణాలు వివరిస్తూ...రాజేంద్రప్రసాద్ అభినయం, ఆదిలోని చురుకుదనం, సాంకేతిక నిపుణుల పనితనం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయని ఆమె అన్నారు. దర్శకురాలిగా భానుమతి రామకృష్ణ, విజయనిర్మల తనకు ఆదర్శమని, వారిలా అన్ని రకాల సినిమాలను చేయాలనేది తన జీవితాశయమని జయ తెలిపారు. బెల్లంకొండ సురేష్, ఎన్వీ ప్రసాద్ లాంటి నిర్మాతలు ఫోన్లు చేసి మరీ అభినందించారని, బెల్లంకొండ సురేష్ తన సంస్థలో ఓ సినిమా చేయమని అడగడం చెప్పలేని ఆనందాన్ని కలిగించిందని జయ అన్నారు.


Click it and Unblock the Notifications











