ఎన్టీఆర్ ‘బాద్ షా’లో ఫారిన్ ఫైట్ మాస్టర్స్
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న 'బాద్ షా' ఫస్ట్ టీజర్ ఆ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల పుట్టినరోజును పురస్కరించుకున ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్‌కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ముఖ్యంగా ఎన్టీఆర్ స్టైలిష్ లుక్, యాక్షన్ సీన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి.
ఈ నేపథ్యంలో 'బాద్ షా' చిత్ర దర్శక నిర్మాతలు ఈ సినిమా కోసం ఫారిన్ ఫైట్ మాస్టర్స్‌ను తీసుకొచ్చి భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈచిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్మాత బండ్ల గణేష్ దీన్ని భారీ నిర్మాణ విలువలతో తీసి బిగ్ సక్సెస్ కొట్టేందుకు ట్రై చేస్తున్నాడు. ఇందుకోసం ఖర్చుకు ఏ మాత్రం వెనకాడటం లేదు.
శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని, ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
ఈచిత్రాన్ని శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఈచిత్రం సంక్రాంతికి విడుదల చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ తాజాగా అందిన సమాచారం ప్రకారం సంక్రాంతి బరి నుంచి 'బాద్ షా' తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే విడుదలకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది.


Click it and Unblock the Notifications











