twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చావటానికైనా సిధ్దమే:బాబు మోహన్ కన్నీరు

    By Staff
    |

    Babu Mohan
    తన కుమారుడు ఉదయబాబు హీరోగా నిర్మించిన 'శ్రీ మేడారం సమ్మక్క సారక్క మహత్మ్యం' సినిమాను నైజాంలో పంపిణీచేసిన జ్యోతి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ అధినేత శంకర్‌గౌడ్‌ తననూ, తన బిడ్డ భవిష్యత్తునూ నాశనం చేయడానికి చూస్తున్నారనీ, దీని వెనుక చిత్రసీమలోని వ్యక్తులున్నారనీ బాబు మోహన్ ఆరోపించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో శుక్రవారం జరిపిన మీడియా సమావేశంలో బాబూమోహన్‌ వ్యక్తం చేసిన ఆవేదన ఇలా వెళ్ళగక్కారు. "నటుడిగా పాతికేళ్లలో సినీ రంగానికి నేను ఎలాంటి మచ్చా తేలేదు. ఎప్పుడూ చెడ్డవాణ్ణి కాలేదు. కానీ నా బిడ్డ (ఉదయబాబు) హీరోగా నేను నిర్మించిన 'సమ్మక్క సారక్క మహత్మ్యం'తో నేను చెడ్డవాణ్ణయ్యా.నా బిడ్డ అందగాడు. ఎంబిఎ చదివాడు. హీరో కావాలనుకున్నాడు. అతనితో నా ఫ్రెండ్స్‌ సినిమా ప్రారంభించి ఆపేస్తే, నేను దాన్ని నిర్మించా. అప్పులుచేసి, ఇల్లు తాకట్టుపెట్టి మూడు కోట్ల రూపాయలతో ఆ సినిమా తీశా.మధ్యమధ్యలో చిన్న చిన్న కారణాలతో షూటింగు ఆగిపోవడం వల్ల లక్షల రూపాయలు నష్టపోయా. యూనిట్‌లోని ఒకర్ని ఖర్చు సంగతి అడిగినందుకు ఏకంగా 42 రోజులపాటు షూటింగ్‌ ఆపేశారు. అయినా సినిమాను పూర్తిచేసి విడుదల చేద్దామంటే థియేటర్లు దొరకలేదు.

    ఆ థియేటర్లన్నీ ఇండస్ట్రీలోని ఇద్దరు ముగ్గురు చేతుల్లో వున్నాయి. అదొక మాఫియాలాగా తయారైంది. దిక్కులేని వాణ్ణి చంపడానికి ఇండస్ట్రీలో దావూద్‌ ఇబ్రహీంలు వున్నారు. వీళ్లకు గుణపాఠం చెప్పేది ఎవరు? నైజాంలో మా సినిమాను పంపిణీ చేస్తానని శంకర్‌ (జ్యోతి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ) వస్తే సరేనన్నా. అతను అడ్వాన్స్‌ కూడా ఇచ్చాడు. హైదరాబాద్‌లో 7 ప్రింట్లతో రిలీజ్‌చేసి, రెండో వారంలో 6 ప్రింట్లను ఇంట్లో పెట్టుకున్నాడు. 50 రోజులు ఆడిస్తానని చెప్పి, రెండోవారానికే థియేటర్ల నుంచి తీసేశాడు. నేను డబ్బులు కట్టి ఆడిస్తానన్నా వినలేదు. నా నియోజకవర్గ కేంద్రం జోగిపేటలో రెండు మూడు రోజుల ఆడించి తీసేశాడు. బ్రహ్మాండంగా ఆడుతున్న థియేటర్ల నుంచి కూడా ప్రింట్లు వెనుకకు తీసుకొస్తున్నాడు.

    నా ప్రింట్లను నాకిచ్చేస్తే ఆడించుకుంటానంటే మనిషి దొరకడం లేదు. ఈ విషయంపై నిర్మాతల మండలినీ, ఫిల్మ్‌ చాంబర్‌నీ సంప్రదించా. వాళ్లేమీ చేయలేమంటున్నారు. మండలి కనీసం ఫిర్యాదును కూడా తీసుకోలేదు. మండలి వున్నది నిర్మాతల సమస్యల్ని పరిష్కరించడానికి కాదా? చాంబర్‌ వాళ్లు చర్చిద్దాం రమ్మంటే వెళ్లా. పది నిమిషాల ఆలస్యమైంది. అక్కడ ఎవరూ లేరు. 'ఏంటి నీ బాధ' అని అడిగిన వాళ్లులేరు. ఇంత దుఃఖాన్నీ, ఆవేదననూ నేనెప్పుడూ అనుభవించలేదు. ఆ డిస్ట్రిబ్యూటర్‌ వెనుక కొంతమంది వుండి ఇదంతా చేయిస్తున్నారు. నా ప్రింట్లు నాకు రాకపోతే రెండు రోజుల్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తా. అప్పుడు ఆ నరరూప రాక్షసుల పేర్లు బయటపెడతా. చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటా. న్యాయం కోసం పోరాటంలో చావుకైనా సిద్ధమే. నాలాగే చాలామంది చిన్న నిర్మాతలు కష్టాలు పడుతున్నారు. తెలుగు రాష్ట్రంలో ఇలాంటి దుస్థితి వుండటం దురదృష్టకరం. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి'' అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X