సీరియల్ నటితో అక్రమ సంబంధం.. ఆత్మహత్య కాదు హత్య.. నటుడి భార్య కేసులో కొత్త ట్విస్ట్
ప్రముఖ టీవీ నటుడు, 'బాహుబలి' ఫేం మధు ప్రకాశ్ భార్య భారతి (34) మంగళవారం రోజు మణికొండ లోని తన నివాసంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఉరి వేసుకొని చనిపోయిందని ప్రాథమిక సమాచారం అందగా.. తాజాగా ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడిన భారతి తల్లిదండ్రులు తమ కూతురు ఉరి వేసుకొని చనిపోలేదని, భర్తే ఆమెను హత్య చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఈ ఉదంతం ఫిలింనగర్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

ఇంట్లో ఉరి వేసుకొని భారతి ఆత్మహత్య
గత కొంతకాలంగా మధు ప్రకాష్, ఆయన భార్య భారతి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో మనశ్శాంతి కోల్పోయిన భారతి మంగళవారం తన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని ప్రాథమిక సమాచారం అందింది. భారతి భర్త మధు ప్రకాష్ కూడా ఆమె ఉరి వేసుకోవడం చూసి షాకయ్యాడని తెలిసింది.

భారతి తల్లిదండ్రుల ఫిర్యాదు
అయితే భారతి తల్లిదండ్రులు మాత్రం తన కూతురు ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధు ప్రకాష్ వేధింపులే ఆత్మహత్యకు కారణం అని వారు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. రెండేళ్ల క్రితం లండన్ నుంచి వచ్చి మరీ అతడిని పెళ్లి చేసుకుంటే తమ కుమార్తెను పొట్టన పెట్టుకున్నారని భారతి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.

మీడియా సంస్థతో అసలు విషయం.. మధు ప్రకాష్ భాగోతం
కాగా తాజాగా భారతి తల్లిదండ్రులు పుట్టా లక్ష్మయ్య, తిరుమల ఓ ప్రముఖ మీడియా సంస్థను ఆశ్రయించి మధు ప్రకాష్ అసలు బాగోతం ఇదీ అని చెప్పారు. సీరియల్‌లో నటిస్తున్న మరో నటితో మధు ప్రకాష్‌కు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఈ నేపథ్యంలో తమ కూతురుని నిర్లక్ష్యం చేస్తూ.. రెండేళ్లుగా తమ కూతురి వేధిస్తున్నాడని భారతి తల్లిదండ్రులు ఆరోపించారు.

అక్రమ సంబంధం కారణంగా
అక్రమ సంబంధం కారణంగా చాలా సార్లు తమ కూతురు, అల్లుడి మధ్య గొడవలు జరుగుతున్నాయని, అయితే వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని వారు అన్నారు. మధు ప్రకాష్ ఎంత చెప్పినా తమ మాటలు పట్టించుకోలేదని, చివరకు తమ కూతురిని కోల్పోయామని ఆవేదన చెందారు. మధు ప్రకాష్‌ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

ఎవరీ మధు ప్రకాష్
టీవీ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన మధు ప్రకాశ్.. ‘కుంకుమపువ్వు' సీరియల్ ద్వారా ఫేం అయ్యాడు. 'బాహుబలి' సహా పలు సినిమాల్లో కూడా నటించాడు. ఆయన రెండేళ్ల క్రితం భారతిని వివాహం చేసుకున్నారు. ఆమె హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో మణికొండలోని పంచవటి కాలనీలో అత్తామామలు, మరిదితో కలిసి ఉంటున్నారు. అనుకోని రీతిలో భారతి మృతి పలు అనుమానాలకు తావిచ్చింది.


Click it and Unblock the Notifications











