IMAX ఫార్మాట్లో ‘బాహుబలి’?
హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా 'బాహుబలి' చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్న దర్శకుడు రాజమౌళి, ఈచిత్రాన్ని IMAX ఫార్మాట్లో చిత్రీకరించేందుకు గల సాధ్యాసాధ్యాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. IMAX ఫార్మాట్లో చిత్రీకరించడం వల్ల 'బాహుబలి'కి ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి రెస్పాన్స్ ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు రాజమౌళి, చిత్ర నిర్మాతలు.
ప్రస్తుతం షాంఘై ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు షాంగై వెళ్లిన రాజమౌళి, నిర్మాత శోభుయార్లగడ్డ ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై ఇంటర్నేషనల్ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. IMAX ఫార్మాట్లో చిత్రీకరిస్తే.......మామూలు 70 ఎంఎం స్క్రీన్ కంటే 3 రెట్లు పెద్దదైన తెరపై సినిమాను కళ్లకు కట్టినట్లు చూసే అవకాశం ఉంటుంది.
మన దేశంలో ఇలాంటి స్క్రీన్లు పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో ప్రసాద్స్ ఐమాక్స్ స్క్రీన్‌ను చెప్పొచ్చు. విదేశాలలో అయితే ఇలాంటి స్క్రీన్లు అధికం. IMAX ఫార్మాట్ సాధ్యమైతే ఈ ఘనత దక్కించుకున్న తొలి తెలుగు సినిమాగా 'బాహుబలి' చరిత్రకెక్కనుంది.
ఇప్పటికే 'ఈగ' చిత్రంతో తెలుగు సినిమా చరిత్రను ఎల్లలు దాటించిన రాజమౌళి....'ఈగ' చిత్రాన్ని ఇంటర్నేషనల్ సినీ మార్కెట్లో ప్రదర్శించే అవకాశం రావడంతో ఇదే అదునుగా తన తర్వాతి ప్రాజెక్టు 'బాహుబలి'కి అంతర్జాతీయ విఫణిలో వ్యాపార మార్గాలు వెతుక్కుంటున్నాడు.
ప్రస్తుతం 'ఈగ' చిత్రం షాంఘై ఫిల్మ్ ఫెస్టవల్‌లో ప్రదర్శితం అవుతుండటంతో.....'బాహుబలి' నిర్మాతలతో కలిసి అక్కడికి వెళ్లిన రాజమౌళి, అక్కడ ఈ సినిమాకు మార్కెట్ బాటలు వేసే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విట్టర్లో వెల్లడిస్తూ ట్వీట్ చేసాడు. 'ఈగ మాకు అంతర్జాతీయ మార్కెట్ లో ఒక స్వల్ప అంతర్దృష్టి ఇచ్చింది. 'బాహుబలి' చిత్రానికి అంతర్జాతీయ బాటలు వేయడానికి ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నాం' అంటూ రాజమౌళి వెల్లడించారు.
దాదాపు వంద కోట్ల భారీ వ్యయంతో ఈచిత్రాన్ని ఆర్కామీడియా తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం కోసం గుర్రపుస్వారి, కత్తియుద్ధం, ధనుర్విద్య, కర్రసాము లాంటి విద్యలను ప్రభాస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు.
అనుష్క హీరోయిన్ కాగా, రానా విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ల నుంది. 'బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. మరో వైపు ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన సెట్టింగ్స్ వేసే పనిలో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











