బెండు తీయటమే నా ట్రెండ్: బాలకృష్ణ
'ట్రెండ్‌లతో పనిలేదు. తప్పు చేసినవాడి బెండ్ తియ్యడమే మన పని'.. 'అధినాయకుడు'లో అదే కనిపిస్తుంది. జరుగుతున్న వాస్తవాలు ఇందులో చూపించాం అంటున్నారు బాలకృష్ణ. ఆయన హీరోగా నటించిన చిత్రం 'అధినాయకుడు'. లక్ష్మీరాయ్, సలోని హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రానికి ఎమ్.ఎల్.పద్మకుమార్ చౌదరి నిర్మాత. పరుచూరి మురళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 1న ప్రేక్షకుల ముందుకొస్తుంది. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో 'అధినాయకుడు' ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిగింది. డి.సురేష్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై బాలకృష్ణకి జ్ఞాపికను అందించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే.. తొలిసారి త్రిపాత్రాభినయం చేశాను. ఇలా త్రిపాత్రాభినయం చేసే దమ్ము ఎవరికి ఉంది? దర్శకుడు కథ చెబుతున్నప్పుడే మూడు పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేశాను. 'ట్రెండ్‌లతో పనిలేదు. తప్పు చేసినవాడి బెండ్ తియ్యడమే మన పని' అని సాగే సంభాషణలు ఇందులో చాలా ఉన్నాయి. ఈ చిత్రంతో నేనొక ప్రయోగం కూడా చేశాను. అదేమిటో తెరపైనే చూడాలి. దర్శకుడు పరుచూరి మురళి, సంగీత దర్శకుడు కల్యాణిమాలిక్ చక్కటి పనితీరు కనబరిచారు''అన్నారు.
ఇక నన్ను ఎన్నికల ప్రచారానికి వస్తున్నారా? అని ఎవరో అడిగారు. వస్తాను అని చెప్పాను. ఎప్పుడొస్తారు అని అడిగారు. నా 'అధినాయకుడు' సినిమాని ప్రచారానికి పంపిస్తున్నా అని చెప్పాను. ప్రజల్లో ఒక తిరుగుబాటునీ, చైతన్యాన్ని తీసుకొచ్చే మంచి చిత్రం ఇది. అందుకే ఆ మాట చెప్పాను అన్నారు. పరుచూరి మురళి ఈ కథ సింగిల్ లైన్ చెప్పినప్పుడే ఛాలెంజింగ్‌గా అనిపించింది. కథ మొత్తం చెప్పకపోయినా తనపై నమ్మకంతో ఓకే చెప్పేశాను. కల్యాణీమాలిక్ సంగీతం, సురేందరరెడ్డి కెమెరా పనితనం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు అని చెప్పుకొచ్చారు.
దర్శకుడు పరుచూరి మురళి మాట్లాడుతూ ''మొదట్లో నేను రామకృష్ణ సినీ స్టూడియోస్‌లో సహాయ దర్శకుడిగా పని చేశాను. ఈ సినిమాకి పని చేసినప్పుడు కూడా నాకు అదే అనుభూతే కలిగింది. కథ విన్నాక బాగా చేసుకో అని చెప్పి నన్ను ప్రోత్సహించారు బాలకృష్ణ. ఎన్టీఆర్‌తో సినిమా చేసిన అనుభూతి కలిగింది''అన్నారు. ఓల్డ్ గెటప్‌లో బాలకృష్ణ పోషించిన పెద్దాయన పాత్ర 20 నిమిషాల పాటు థియేటర్లలో మెరుపులు మెరిపిస్తుందని నమ్మకంగా చెప్పారు.
అధినాయకుడు'లో బాలయ్య పోషించిన మూడు పాత్రల్లో ఓల్డ్ గెటప్ చూస్తే... 'బడిపంతులు' సినిమాలో పెద్దాయన ఎన్టీఆర్ గుర్తొచ్చారని బ్రహ్మానందం చెప్పారు. బాలకృష్ణకున్న ఇమేజ్ దృష్ట్యా ఇది సరైన టైటిల్ అని బి.గోపాల్ అభిప్రాయపడ్డారు. 'సింహా'లా ఈ సినిమా కూడా ఓ చరిత్ర సృష్టిస్తుందని బెల్లంకొండ సురేష్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు సి.అశ్వనీదత్, డి.సురేష్‌బాబు, నందమూరి రామకృష్ణ, యలమంచిలి సాయిబాబు, వినోద్ సూర్యదేవర, తమ్మారెడ్డి భరద్వాజ్, సురేందర్‌రెడ్డి, కోట శ్రీనివాసరావు, కాశీవిశ్వనాథ్, ఏఆర్వీ ప్రసాద్, భాస్కరభట్ల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











